99 వద్ద ఔట్‌.. కివీస్‌ క్రీడా స్ఫూర్తి!

30 Jan, 2020 15:43 IST|Sakshi

బెనోని(దక్షిణాఫ్రికా): అండర్‌-19 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ సెమీస్‌లోకి ప్రవేశించింది. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన సూపర్‌ లీగ్‌ క్వార్టర్‌ ఫైనల్‌-2లో న్యూజిలాండ్‌ జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 47.5 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. దాంతో 239 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్‌ రెండు బంతులు మిగిలి ఉండగా విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. అయితే విండీస్‌ బ్యాటింగ్‌ చేసే క్రమంలో సెకండ్‌ డౌన్‌లో వచ్చిన కిర్క్‌ మెకంజీ కుడి కాలు పట్టేయడంతో విపరీతమైన నొప్పితో సతమతమయ్యాడు. (ఇక్కడ చదవండి: కోతి కాటు.. వరల్డ్‌కప్‌ నుంచి ఔట్‌!)

ఈ క్రమంలోనే 99 పరుగుల వద్ద ఉండగా రిటర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 43 ఓవర్‌ చివరి బంతికి పెవిలియన్‌ వీడాడు. కాగా, విండీస్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన మెకంజీ 99 పరుగుల వద్దే ఆఖరి వికెట్‌గా ఔటయ్యాడు. మళ్లీ స్టైకింగ్‌కు వచ్చి ఆడిన తొలి బంతికే బౌల్డ్‌ అయ్యాడు. దాంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ 13 బంతులు ఉండగా ముగిసింది. అయితే కాలిపిక్క గాయంతో సతమతమైన మెకంజీ పెవిలియన్‌కు చేరుకునే క్రమంలో ఇబ్బంది పడ్డాడు. విపరీతమైన నొప్పితో సతమతమవుతూ నడవడానికి ఇబ్బంది పడటంతో కివీస్‌ ఆటగాళ్లు ఇద్దరు అతన్ని భుజాలపై వేసుకుని బౌండరీ లైన్‌ వరకూ తీసుకెళ్లి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. దీనిపై టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ తన ట్వీటర్‌ అకౌంట్‌లో ‘ఇది కదా స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అంటూ  పోస్ట్‌ చేశాడు. ఇదొక మంచి పరిణామమని పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: సెమీస్‌లో యువ భారత్‌)

మరిన్ని వార్తలు