కివీస్‌ తొలి వికెట్‌ కీపర్‌గా వాట్లింగ్‌ రికార్డు..

24 Nov, 2019 12:30 IST|Sakshi

మౌంట్‌ మాంగని (న్యూజిలాండ్‌): ద్విశతకం సాధించిన తొలి న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌గా వాట్లింగ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వాట్లింగ్‌(205; 473 బంతుల్లో 24 ఫోర్లు, 1 సిక్సర్‌) అద్వితీయమైన ఆటతీరుతో జట్టును కష్టకాలంలో ఆదుకున్నాడు. ఆదుకోవడమే కాకుండా డబుల్‌ సెంచరీతో కివీస్‌కు భారీ ఆధిక్యాన్ని అందించాడు. వాట్లాంగ్‌కు తోడు సాన్‌ట్నెర్‌ (126; 269 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో వాట్లింగ్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 261 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక వాట్లింగ్‌ డబుల్‌ సెంచరీ సాధించడంతో కివీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రెండన్‌ మెకల్లమ్‌ రికార్డు తుడుచుపెట్టుకపోయింది. 

ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన కివీస్‌ వికెట్‌ కీపర్‌గా మెకల్లమ్‌(185; బంగ్లాదేశ్‌పై 2010లో) రికార్డును ఈ వికెట్‌ కీపర్‌ బ్రేక్‌ చేశాడు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో డబుల్‌ సెంచరీ సాధించిన తొమ్మిదో వికెట్‌ కీపర్‌గా వాట్లింగ్‌ నిలిచాడు. ఈ జాబితాలో కుమార సంగక్కర అత్యధిక డబుల్‌ సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా.. అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన వికెట్‌ కీపర్‌గా జింబాబ్వే మాజీ క్రికెటర్‌ ఆండ్రీ ఫ్లవర్‌(232 నాటౌట్‌; భారత్‌పై 2000లో) రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇక టీమిండియా తరుపున ఏకైక డబుల్‌ సెంచరీ సాధించిన వికెట్‌ కీపర్‌గా మాజీ సారథి ఎంఎస్‌ ధోని(224; ఆస్ట్రేలియాపై 2013లో) నిలిచిన విషయం తెలిసిందే.  

ఈ మ్యాచ్‌లో వాట్లింగ్‌, సాన్‌ట్నెర్‌ రాణించడంతో కివీస్‌ 615/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ బర్న్స్‌(31) , డొమినిక్ సిబ్లీ(12), జాక్‌ లీచ్‌(0) పూర్తిగా విఫలమయ్యారు.  ప్రస్తుతం జోయ్‌ డెన్లీ(7 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్‌ ఇంకా 207 పరుగుల వెనుకంజలో ఉంది. ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇంగ్లండ్‌ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సారథి రూట్‌, ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ రాణింపుపైనే ఆధారపడి ఉంది.  

మరిన్ని వార్తలు