సచిన్‌ వికెట్‌ తీస్తే బహుమతి 

28 Jun, 2020 21:35 IST|Sakshi

ముంబై: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆటను ఆస్వాదించిన వారు కొందరైతే.. అతడి ఆటతో స్పూర్థి పొంది క్రికెట్‌నే వృత్తిగా ఎంచుకున్న వారు మరికొంత మంది ఉన్నారు. అలా స్పూర్తి పొంది క్రికెట్‌లో అడుగుపెట్టిన ఏ బౌలర్‌కైనా సచిన్‌ వికెట్‌ను పడగొడితే ఆ ఆనందం టన్నుల్లో ఉంటుంది. ప్రత్యర్థి వ్యూహం, ప్రతీ బౌలర్‌ టార్గెట్‌ సచిన్‌ను ఔట్‌ చేయడమే ప్రధానంగా ఉండేది. ఇక సచిన్‌ వికెట్‌ పడగొడితే సహచర క్రికెటర్లు, అభిమానుల నుంచి అభినందనలే కాదు బహుమతులు కూడా రావడం విశేషం. ఇలా సచిన్‌ వికెట్‌ పడగొట్టి బహుమతి తీసుకున్నానని టీమిండియా మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా చెప్పుకొచ్చాడు. (క్రికెట్‌లో నెపోటిజమ్‌ రచ్చ.. చోప్రా క్లారిటీ)

దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్‌-2009 సందర్భంగా డెక్కన్‌ ఛార్జర్స్‌ తరుపున ఓజా ప్రాతినిథ్యం వహించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఆ సీజన్‌లో డర్బన్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ వికెట్‌ పడగొట్టిన విషయాన్ని ఓజా గుర్తుచేసుకున్నాడు. ‘ముంబైతో మ్యాచ్‌కు ముందు రోజు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా డెక్కన్‌ ఛార్జర్స్‌ ఓనర్‌ వచ్చి సచిన్‌ వికెట్‌ పడగొడితే స్పెషల్‌ గిఫ్గ్‌ ఇస్తానన్నాడు. అప్పుడు సచిన్‌ వికెట్‌ పడగొడితే నాకు వాచ్‌ గిఫ్ట్‌గా కావాలని కోరాను. అయితే ఆ మ్యాచ్‌లో సచిన్‌ వికెట్‌ పడగొట్టడంతో నాకు వాచ్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. సచిన్‌ వికెట్‌ తీసిన ఆనందం మాటల్లో చెప్పలేను. ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతి అది’ అంటూ ఓజా పేర్కొన్నాడు. ఇక టీమిండియా తరుపున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20ల్లో పాల్గొన్న ఓజా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. (వారే విఫలమైతే నా పరిస్థితి ఏమిటి?)

మరిన్ని వార్తలు