దిగ్గజాల సరసన చేరిపోయాడు..

25 Feb, 2017 16:29 IST|Sakshi
దిగ్గజాల సరసన చేరిపోయాడు..

పుణె: ఆస్ట్రేలియా స్పిన్నర్ ఓకీఫ్.. భారత పర్యటనకు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన క్రికెటర్. ఈ టెస్టుకు ముందు కేవలం నాలుగు టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడిన ఓకీఫ్ పై ఆసీస్ కూడా భారీ ఆశలు కూడా పెట్టుకోలేదు. భారత్ లోని పిచ్లు స్సిన్ కు అనుకూలిస్తాయి కాబట్టి ఓకీఫ్ కు ఆసీస్ జట్టులో స్థానం కల్పించారు. అయితే ఇప్పుడు ఓకీఫ్ ఒక్కసారిగా హీరోగా మారిపో్యాడు. అసలు సొంతగడ్డపై గత 20 మ్యాచ్ల్లో ఒక్క ఓటమి కూడా లేని భారత్ కు గట్టి షాకిచ్చి సెలబ్రెటీ అయిపోయాడు. ఈ మ్యాచ్లో మొత్తం ఓకీఫ్ సాధించిన వికెట్లు 12. తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసిన ఓకీఫ్.. రెండో ఇన్నింగ్స్ లో్ కూడా 35 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేశాడు.

 

మరొకవైపు దిగ్గజాల సరసన కూడా చేరిపోయాడు ఓకీఫ్. భారత్ పై భారత్ లో ఒక టెస్టు మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఓకీఫ్ నిలిచాడు. ఈ రికార్డు పరంగా ఇంగ్లండ్ మాజీ పేసర్ ఇయాన్ బోథమ్ ముందు వరుసలో ఉన్నాడు. 1980, ఫిబ్రవరి 15వ తేదీన భారత్ తో ముంబైలో జరిగిన టెస్టులో ఇయాన్ బోథమ్ ఒక టెస్టు మ్యాచ్లో 13 వికెట్లు సాధించాడు. ఆ తరువాత వరుసగా ఓకీఫ్ రెండో బౌలర్ గా గుర్తింపు పొందాడు. ఆపై ఫజాల్ మొహ్మద్(పాకిస్తాన్), ఏమీ రాబర్ట్స్(వెస్టిండీస్), డేవిడ్ సన్(ఆస్ట్రేలియా)లు ఉన్నారు.

మరిన్ని వార్తలు