తలా ఓ చెయ్యేశారు...

21 Jul, 2016 00:26 IST|Sakshi
తలా ఓ చెయ్యేశారు...

ధరమ్‌వీర్‌కు చేయూతనిచ్చిన గ్రామస్థులు 
ఒలింపిక్ 200మీ. బరిలో భారత అథ్లెట్
 

చండీగఢ్: ఆ కుర్రాడిలో నైపుణ్యం ఉంది... కానీ శిక్షణకు డబ్బు లేదు... ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ నెలకు రూ.16 వేలు సంపాదిస్తున్నాడు. కానీ పేద కుటుంబం. తండ్రి రైతు. శిక్షణ కోసం నెలకు రూ.40 వేలు ఖర్చవుతోంది..? ఏం చేయాలి..? నాలుగు నెలల క్రితం భారత అథ్లెట్ ధరమ్‌వీర్ పరిస్థితి ఇది. సాధారణంగా క్రీడల్లో శిక్షణ కోసం డబ్బులు కావాలంటే చాలా మంది బంధువులు కూడా అప్పు ఇవ్వడానికి వెనకాడతారు. కానీ హరియాణాలోని రోహటక్ జిల్లాలో ఉన్న అజాయిబ్ గ్రామస్థులు మాత్రం ఇంకోలా ఆలోచించారు. తమ ఊరి కుర్రాడిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. తలా ఓ చెయ్యేసి రూ.4.5 లక్షలు జమ చేశారు. ఆ డబ్బు మార్చిలో ధరమ్‌వీర్‌కు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకుని శిక్షణ కొనసాగించిన ఈ అథ్లెట్ మూడు నెలల్లోనే ఆ గ్రామస్థుల్లో సంబరాన్ని నింపాడు. 200 మీటర్ల విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఆ గ్రామస్థుల ప్రోత్సాహం, ధరమ్‌వీర్ కష్టంతో... 200 మీటర్ల పరుగుకు 36 ఏళ్ల విరామం తర్వాత భారత్ నుంచి ఓ అథ్లెట్ ఒలింపిక్స్‌కు వెళుతున్నాడు.

ఒలింపిక్స్ అర్హత మీట్‌లో ధరమ్‌వీర్ 200మీ.ను 20.45 సెకన్లలో పూర్తిచేసి రియో ప్రమాణాన్ని (20.50 సె) అందుకున్నాడు. అంతే కాకుండా 2015 ఆసియా చాంపియన్‌షిప్‌లో 20.66 సెకన్లతో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును కూడా సవరించాడు. ‘వాస్తవానికి 2012 లండన్ ఒలింపిక్స్‌కే ధరమ్‌వీర్ అర్హత సాధించాలి. అయితే ప్రభుత్వ  సహాయం లేకపోవడం, శిక్షణకు కావాల్సినంత డబ్బు లేకపోవడం కారణంగా అతను ఏమీ చేయలేకపోయాడు. 2006లో కాలేజీ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా తొలిసారిగా ధరమ్‌వీర్ ప్రతిభను గుర్తించాను. ఆర్థిక ఇబ్బం దులు లేకపోయుంటే ఈపాటికే అతను మరిన్ని ఘనతలు సాధించేవాడు’ అని పదేళ్లుగా అతనికి కోచ్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ రమేశ్ సంధూ తెలిపారు.

బోల్ట్ గురించి ఆలోచించను...
రియో ఒలింపిక్స్‌లో తన వ్యక్తిగత ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకునేందుకు కృషి చేస్తానని ధరమ్‌వీర్ తెలిపాడు. 200 మీటర్ల విభాగంలో ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ అయిన జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్ గురించి ఆలోచించడం లేదన్నాడు. ‘రియోలో బోల్ట్ నాకు మరో ప్రత్యర్థి లాంటివాడు. నా ప్రదర్శనపైనే నేను దృష్టి పెట్టాను. 20 సెకన్లలోపు పరుగెత్తడమే నా లక్ష్యం. రియోకు అర్హత సాధించడం నాకేమీ ఆశ్చర్యమనిపించలేదు. ఈ లక్ష్యం కోసం నేను ఎనిమిదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నాను. భారత్‌లో ప్రతిభకు కొదువలేదు. సరైన సహాయం లభిస్తే మరింతమంది వెలుగులోకి వస్తారు’ అని ధరమ్‌వీర్ అంటున్నాడు.
 
 

>
మరిన్ని వార్తలు