ఒలింపిక్‌ డే రన్‌కు విశేష స్పందన

24 Jun, 2018 10:13 IST|Sakshi

పరుగులో పాల్గొన్న 3,000 మంది చిన్నారులు

సాక్షి, హైదరాబాద్‌: భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ), ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘ఒలింపిక్‌ డే రన్‌’కు విశేష స్పందన లభించింది. 3,000 మందికి పైగా చిన్నారులు ఈ పరుగులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, రాష్ట్ర క్రీడల కార్యదర్శి బుర్రా వెంకటేశం ఒలింపిక్‌ జ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు. చార్మినార్, విక్టరీ ప్లేగ్రౌండ్, వైఎంసీఏ, గాంధీ విగ్రహం, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మెహదీపట్నం, యూసుఫ్‌గూడ మీదుగా నిర్వహించిన ఈ పరుగు ముగింపోత్సవం ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్ని ఎంతో ప్రోత్సహిస్తుందని అన్నారు.

ఇటీవలి కాలంలో మారుమూల గ్రామాల్లోని క్రీడాకారులు సైతం జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తా చాటుతున్నారని కితాబిచ్చారు. తెలంగాణలో క్రీడాభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులకు ప్రోత్సాహకంగా సర్కారు 10 నుంచి 50 లక్షల వరకు ఇస్తోందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్‌ను కల్పించడంతో యువత క్రీడల్ని కెరీర్‌గా ఎంచుకునేందుకు స్ఫూర్తినిస్తుందన్నారు. దేశంలోనే క్రీడల్లో తెలంగాణను నంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిపేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్, నంది టైర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భరత్‌ కుమార్‌ రెడ్డి, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు