ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఒలింపిక్‌ పోడియాలు

11 Jun, 2019 21:28 IST|Sakshi

టోక్యో: వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌కు గాను నిర్వాహకులు మరో స్ఫూర్తిదాయక నిర్ణయం ప్రకటించారు. ఈ విశ్వక్రీడల్లో విజేతలకు ఇచ్చే స్వర్ణ, రజత, కాంస్య పతకాలను ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలతో తయారుచేయనున్నట్లు ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా విజేతలకు పతకాలను అందించేందుకు ఏర్పాటు చేయనున్న పోడియంలను ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రూపొందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గృహ, సముద్రాల్లో లభించే ప్లాస్టిక్‌ వ్యర్థాలను పోడియంల రూపకల్పనకు వాడనున్నారు. 

టోర్నీలో భాగంగా మొత్తం 100 పోడియంలు నిర్మించాల్సి ఉన్నందున ఆ మేరకు 45 టన్నుల వ్యర్థాలు అవసరం కానున్నాయి. గృహ ప్లాస్టిక్‌ వ్యర్థాలను టోర్నీ ఆతిథ్య దేశమైన జపాన్‌ నుంచి మాత్రమే సేకరిస్తారు. దీనికోసం ఇక్కడ దాదాపు 2వేలకు పైగా ఉన్న సూపర్‌ మార్కెట్ల ద్వారా వ్యర్థాలను సమీకరిస్తారు. స్థానికుల నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించేందుకు ఈ సూపర్‌ మార్కెట్ల వద్ద కొన్ని డబ్బాలను ఒలింపిక్‌ నిర్వాహకులు ఉంచుతారు. అలాగే సముద్రాల నుంచి వ్యర్థాలను వెలికితీసే కంపెనీల ద్వారా ప్లాస్టిక్‌ను సేకరిస్తారు. కాగా, ఈ ప్రతిష్టాత్మక విశ్వక్రీడల్లో పాల్గొనే జపాన్‌ క్రీడాకారులు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రూపొందించిన దుస్తులను ధరించనుండడం మరో విశేషం! 
 

మరిన్ని వార్తలు