సైనా పయనం ఎంతవరకు?

18 Mar, 2020 01:09 IST|Sakshi

ఒలింపిక్‌ అర్హత టోర్నీలు రద్దు

దిగజారిన ఫామ్‌

వరుస పరాజయాలతో డీలా

భారత బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్‌ది ప్రత్యేక స్థానం... దేశవ్యాప్తంగా ఆటపై ఆసక్తి పెంచడంలో, ముఖ్యంగా అమ్మాయిలు బ్యాడ్మింటన్‌ వైపు ఆకర్షితులు కావడంతో సైనా స్ఫూర్తిగా నిలిచింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో ఆమె కెరీర్‌ శిఖరానికి చేరగా... పెద్ద సంఖ్యలో సాధించిన విజయాలు, అందుకున్న అవార్డులు, రివార్డులు సైనా స్థాయిని చూపిస్తాయి. అయితే గత కొంత కాలంగా సైనా ఆట అంతంతమాత్రంగానే సాగుతోంది. వరుస పరాజయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలు ఆమెను వెనక్కి తోస్తున్నాయి. రియో ఒలింపిక్స్‌లో వైఫల్యం తర్వాత ఈ సారి మళ్లీ ఒలింపిక్స్‌పై ఆమె గురి పెట్టింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అసలు సైనా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలదా అనేది చూడాలి.  

(సాక్షి క్రీడా విభాగం): సైనా నెహ్వాల్‌ మంగళవారమే తన 30వ పుట్టిన రోజు జరుపుకుంది. తన వ్యక్తిగత జీవితంలో ఒక కీలక దశకు చేరిన తర్వాత ఆమె ముందు ఇప్పుడు పెద్ద సవాల్‌ నిలిచింది. మరోసారి ఒలింపిక్స్‌లో పాల్గొనాలని పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) తీసుకున్న నిర్ణయం ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. కరోనా వైరస్‌ కారణంగా ఏప్రిల్‌ 12 వరకు జరగాల్సిన అన్ని టోర్నీలను రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది.  రాబోయే టోర్నీలలో రాణించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనుకుంటున్న షట్లర్లను ఇది షాక్‌కు గురి చేసింది. మంగళవారం జరిగిన కీలక సమావేశం అనంతరం టోక్యో ఒలింపిక్స్‌ను ఎలాగైనా నిర్వహిస్తామంటూ కమిటీ విస్పష్టంగా ప్రకటించింది. కాబట్టి బ్యాడ్మింటన్‌లో నెలకొన్న తాజా పరిస్థితి ఆందోళన కలిగించేదే.

వరుస వైఫల్యాలు... 
దాదాపు ఏడాది కాలంగా సైనా ప్రదర్శన గొప్పగా లేదు. టోర్నీ విజయాలపరంగా కూడా ఆమె టైటిల్‌ సాధించి చాలా రోజులైంది. 2019 జనవరిలో ఆమె చివరిసారిగా ఇండోనేసియా మాస్టర్స్‌ గెలిచింది. అదీ ఫైనల్లో 4–10తో వెనుకబడిన దశలో మారిన్‌ గాయంతో తప్పుకున్న తర్వాత దక్కింది. అంతకు ముందు చూస్తే 2017 జనవరిలో మలేసియా మాస్టర్స్‌ ఆమె గెలిచిన చివరి టోర్నీ. ఈ రెండు కూడా సూపర్‌–500 స్థాయి టోర్నీలే. సైనా ఆట సహజంగానే ఆమె ర్యాంకింగ్‌పై ప్రభావం చూపించింది. 2019లో సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న సైనా, ఇప్పుడు 20వ ర్యాంక్‌కు చేరింది. 2020 కూడా ఆమెకు కలిసి రాలేదు. మలేసియా మాస్టర్స్, స్పెయిన్‌ మాస్టర్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన సైనా...ఇండోనేసియా మాస్టర్స్, థాయిలాండ్‌ మాస్టర్స్, ఆల్‌ ఇంగ్లండ్‌లలో తొలి రౌండ్‌లోనే చిత్తయింది. ఇప్పుడు కీలకమైన ఒలింపిక్స్‌కు ముందు జరిగే టోర్నీలో రాణించాలని భావించిన తరుణంలో టోర్నీల రద్దు ఇబ్బందికరంగా మారింది.

ప్రస్తుతం 22వ స్థానంలో... 
బీడబ్ల్యూఎఫ్‌ రద్దు చేసిన టోర్నీల్లో స్విస్‌ ఓపెన్, ఇండియా ఓపెన్‌ కూడా ఉన్నాయి. ఇందులో స్విస్‌ సైనాకు గతంలోనూ బాగా కలిసి రాగా... ఈ సారి రెండు టోర్నీల్లోనూ ఆమెకు మంచి ‘డ్రా’ ఎదురైంది. ఒలింపిక్స్‌కు అర్హత కల్పించే పాయింట్ల ప్రకారం (రేస్‌ టు టోక్యో) చూస్తే ఆమె ప్రస్తుతం 22వ ర్యాంకులో ఉంది. గత ఏడాది కాలంగా ఆమె ఆడిన 15 టోర్నీల ద్వారా 41,847 పాయింట్లు సైనా ఖాతాలో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో బీడబ్ల్యూఎఫ్‌ రద్దు చేసిన టోర్నీలు జరిగే అవకాశం లేకపోతే...సైనా చేయడానికేమీ ఉండదు! ఎందుకంటే ఒలింపిక్‌ అర్హత కోసం కటాఫ్‌ తేదీ అయిన ఏప్రిల్‌ 30నాటికి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి 16 స్థానాల్లో ఉన్నవారికే అర్హత లభిస్తుంది. తాజా పరిస్థితుల్లో ఆమె ఆ జాబితాలో రాదు.

ఒక వేళ కొన్ని టోర్నీలు జరిగినా ఆమె తన అత్యుత్తమ ప్రదర్శనకు మించి ఇవ్వాల్సి ఉంది. ఫైనల్‌ లేదా సెమీఫైనల్‌ చేరితేనే సైనా ఖాతాలో పెద్ద సంఖ్యలో పాయింట్లు చేరతాయి. అయితే ఇటీవలి ఫామ్‌ను చూస్తే ఇది అంత సులువుగా అనిపించడం లేదు. గెలవాలనే పట్టుదల, అందు కోసం ఆమె తగిన విధంగా శ్రమిస్తున్నా కోర్టులో సైనా కదలికల్లో చురుకుదనం తగ్గినట్లే కనిపిస్తోంది. కొత్తగా దూసుకొస్తున్న అమ్మాయిలు చెలరేగిపోతుంటే చాలా సందర్భాల్లో సైనా వారి ముందు బేలగా కనిపిస్తోంది. ఆమె తన అత్యుత్తమ దశను దాటేసినట్లుగా ఇటీవలి ఫలితాలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఒలింపిక్‌ రేసులో ఎంత వరకు ముందుకు వెళ్లగలదనేది చూడాలి.  


మంగళవారం తన తండ్రి హర్వీర్‌ సింగ్‌తో కలిసి ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సైనా.

మరిన్ని వార్తలు