సెమెన్యాకు ఎదురుదెబ్బ 

2 May, 2019 00:34 IST|Sakshi

లుసానే: దక్షిణాఫ్రికా విఖ్యాత రన్నర్, 800 మీటర్ల విభాగంలో డబుల్‌ ఒలింపిక్‌ చాంపియన్‌ క్యాస్టర్‌ సెమెన్యాకు ఆర్బిట్రేషన్‌ కోర్టు (స్పోర్ట్స్‌)లో చుక్కెదురైంది. ఆమె అమ్మాయే అయినా ఆమెలో పురుష హార్మోన్లు ఉన్నాయని, పోటీల్లో ఆమె సామర్థ్యానికి ఇవి లబ్ది చేకూరుస్తున్నాయని అంతర్జాతీయ అమెచ్యూర్‌ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌) సెమెన్యా పాల్గొనే పోటీలపై గతంలో ఆంక్షలు విధించింది. తనపై ఐఏఏఎఫ్‌ ఉద్దేశపూర్వకంగా కక్ష్య సాధిస్తోందని ఆరోపిస్తూ.. ఆర్బిట్రేషన్‌ కోర్టులో సెమెన్యా సవాలు చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత బుధవారం ముగ్గురు జడ్జీలతో కూడిన త్రిసభ్య బెంచ్‌ సెమెన్యాకు ప్రతికూలంగా తీర్పునిచ్చింది. అయితే దీనిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

మహిళలకు నష్టం కలుగకుండా, వివక్షకు తావులేకుండా చూడాలని తమ తీర్పులో పేర్కొన్నారు. మరోవైపు ఇదివరకే అంతర్జాతీయ సమాజం ఐఏఏఎఫ్‌ తీరును నిరసించింది. ఓ అథ్లెట్‌ విజయం వెనుక కేవలం హార్మోన్ల ప్రభావమే ఉండదని... కఠోర శ్రమ, నిబద్ధత, సాధించాలనే తపనతోనే ఆ స్థాయికి చేరుకుంటారని పేర్కొంది. వీటన్నింటిని కాదని ఒక్క కారణం (హార్మోన్లు)తో అథ్లెట్‌ విజయాన్ని శంకించడం అవివేకమని పలువురు క్రీడా నిపుణులు తప్పుబట్టారు.  భవిష్యత్‌లో సెమెన్యా అంత ర్జాతీయ రేసుల్లో పోటీపడాలంటే ఆమె శరీరంలోని పురుష హార్మోన్ల సంఖ్యను తగ్గించుకోవాల్సి ఉంటుంది.   

మరిన్ని వార్తలు