నేడు జపాన్‌కు ఒలింపిక్‌ జ్యోతి

20 Mar, 2020 01:32 IST|Sakshi

టోక్యో: ఒలింపిక్‌ జ్యోతి శుక్రవారం జపాన్‌ గడ్డపై అడుగుపెట్టనుంది. కోవిడ్‌–19 ఉగ్రరూపంతో మెగా ఈవెంట్‌పై సందేహాలున్నప్పటికీ టార్చ్‌ రిలేకు మాత్రం రంగం సిద్ధమైంది. శుక్రవారం ఒలింపిక్‌ జ్యోతి స్వాగత కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు. అతికొద్ది మంది సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. 20వ తేదీనే జపాన్‌ గడ్డపై అడుగుపెట్టినప్పటికీ అధికారిక రిలే మాత్రం 26న మొదలవుతుందని టోక్యో నిర్వాహక కమిటీ తెలిపింది. అంతకుముందు గ్రీస్‌ నుంచి ఆతిథ్య దేశానికి జ్యోతిని అప్పగించే కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా ముగించేశారు. ఒలింపిక్‌ జిమ్నాస్టిక్‌ చాంపియన్‌ పెట్రొనియాస్‌ టార్చ్‌ను పోల్‌వాల్ట్‌ చాంపియన్‌ కటేరినాకు అందజేశారు. అక్కడి నుంచి జపాన్‌ దాకా సాగాల్సిన రిలేను అక్కడే ‘మమ’ అనిపించారు. అక్కడే ఉన్న జపాన్‌కు చెందిన మాజీ స్విమ్మర్‌ నవోకో ఇమొటోకు అందించారు. ఎంతో అట్టహాసంగా జరగాల్సిన ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గతవారం ఏథెన్స్‌లో  మొక్కుబడిగా నిర్వహించారు. అతి కొద్ది మంది సమక్షంలో ఈ వేడుక జరిగింది.

జూన్‌ 7 దాకా టోర్నీలన్నీ రద్దు 
మహిళల, పురుషుల ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ టోర్నీలను జూన్‌ 7 వరకు నిలిపివేసినట్లు డబ్ల్యూటీఏ, ఏటీపీ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాయి. మరో వైపు భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ కరోనాపై స్పందించాడు. ప్రజలంతా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాలనే పాటించాలని, అసత్య వార్తల్ని, ప్రచారాన్ని పట్టించుకోరాదని సూచించాడు. 

మరిన్ని వార్తలు