భయపడిందే జరిగింది!

27 Mar, 2020 06:22 IST|Sakshi

ఒలింపిక్స్‌ వాయిదాపై రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌  

న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్‌ వాయిదాపై క్రీడాకారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వాయిదా నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేసింది. తాము భయపడిందే చివరికి జరిగిందని వినేశ్‌ పేర్కొంది. ‘ఐఓసీ తాజా నిర్ణయంతో చాలా నిరాశ చెందాను. ఒలింపిక్స్‌ వాయిదా వేస్తారేమో అని అందరం భయపడ్డాం. చివరకు అదే జరిగింది. ఒలింపిక్స్‌ వేదికపై రాణించడం ఒక అథ్లెట్‌కు చాలా కష్టం. కానీ ఇప్పుడు ఈ గేమ్స్‌ కోసం వేచి చూడటం, మళ్లీ సన్నాహకాలు కొనసాగించడం దానికన్నా పెద్ద కష్టం. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎన్నో భావోద్వేగాలు నన్ను చుట్టుముడుతున్నాయి’ అని 25 ఏళ్ల వినేశ్‌ తెలిపింది. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన వినేశ్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

మరిన్ని వార్తలు