ఎందరో మహానుభావులు

15 Jul, 2016 01:42 IST|Sakshi
ఎందరో మహానుభావులు

అద్వితీయ ప్రదర్శనతో ఒలింపిక్స్‌కే వన్నె తెచ్చిన దిగ్గజాలు
 
ఒక్క అవకాశంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు ఒలింపిక్స్ క్రీడలు వేదికగా నిలుస్తాయి. ఈ విశ్వ క్రీడల సంరంభంలో ఒకసారైనా పాల్గొనాలని, పతకంతో తిరిగి రావాలని క్రీడాకారులందరూ పరితపిస్తారు. కేవలం ప్రాతినిధ్యమే కాకుండా తమ అద్వితీయ ప్రదర్శనతో పతకాలు కొల్లగొట్టి... ఎందరికో స్ఫూర్తిగా నిలిచి.. ఈ ప్రపంచ క్రీడల పండుగకు వన్నె తెచ్చిన క్రీడాకారులెందరో ఉన్నారు. వారిలో కొందరి గురించి క్లుప్తంగా.. -  సాక్షి క్రీడావిభాగం
 
మైకేల్ ఫెల్ప్స్
బరిలో దిగితే పతకమే.
..
ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడు మైకేల్ ఫెల్ప్స్. అమెరికాకు చెందిన ఈ 31 ఏళ్ల స్విమ్మర్ ఇప్పటికే మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొని 22 పతకాలు సాధించాడు. ఇందులో 18 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. ‘బాల్టిమోర్ బుల్లెట్’... ‘ఫ్లయింగ్ ఫిష్’ ముద్దు పేర్లు కలిగిన ఈ 6 అడుగుల 4 అంగుళాల ఎత్తున్న స్విమ్మర్ రియో ఒలింపిక్స్‌లో మరోసారి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో    ఫెల్ప్స్ ఏకంగా 8 స్వర్ణాలు గెలిచి ఒకే ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. అమెరికాకే చెందిన స్విమ్మర్ మార్క్ స్పిట్జ్ (1972 మ్యూనిచ్-7 స్వర్ణాలు) పేరిట ఉన్న ఈ రికార్డును ఫెల్ప్స్ బద్దలు కొట్టాడు.
 
నాడియా కొమనెసి
పర్‌ఫెక్ట్ జిమ్నాస్ట్..
.
మహిళల జిమ్నాస్టిక్స్‌ను ప్రస్తావిస్తే అందరి మదిలో మెదిలే తొలిపేరు నాడియా కొమనెసి. రొమేనియాకు చెందిన ఈ జిమ్నాస్ట్ 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో కేవలం 15 ఏళ్ల ప్రాయంలో మూడు స్వర్ణాలు సొంతం చేసుకుంది. ఈ ఒలింపిక్స్‌లో నాడియా ఆల్ రౌండ్, అన్‌ఈవెన్ బార్స్, బ్యాలెన్సింగ్ బీమ్ విభాగాల్లో 10కి 10 పాయింట్లు స్కోరు చేసి ఈ ఘనత సాధించిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో మరో రెండు స్వర్ణాలు నెగ్గిన నాడియో 1981లో 20 ఏళ్లకే ఈ క్రీడకు వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి నాడియా ఒలింపిక్స్‌లో 5 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యంతో కలిపి తొమ్మిది పతకాలు సాధించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అత్యున్నత పురస్కారం ‘ఒలింపిక్ ఆర్డర్’ను రెండుసార్లు అందుకున్న ఏకైక క్రీడాకారిణి నాడియా కావడం విశేషం.
 
వితాలీ షెర్బో
ఒకే ఒక్కడు.
..
ఒలింపిక్స్‌లో ఒక్క పతకం సాధిస్తేనే గొప్పగా భావించే చోట ఒకే ఒలింపిక్స్‌లో ఏకంగా ఆరు స్వర్ణాలతో మెరిసిన జిమ్నాస్ట్ వితాలీ షెర్బో. ఒకప్పటి సోవియట్ యూనియన్‌కు చెందిన షెర్బో 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో టీమ్, ఆల్ రౌండ్, పామెల్  హార్స్, రోమన్ రింగ్స్, వాల్టింగ్, పారలల్ బార్స్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు. 1991 డిసెంబరులో సోవియట్ యూనియన్ విచ్ఛినమైన తర్వాత ఏర్పడిన కొత్త దేశాలకు చెందిన క్రీడాకారులందరూ ‘యూనిఫైడ్ టీమ్’ పేరుతో 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. షెర్బో కూడా యూనిఫైడ్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు. షెర్బో తర్వాత ఇప్పటివరకు ఏ జిమ్నాస్ట్ కూడా ఒకే ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలు సాధించలేదు. 1996లో షెర్బో భార్య ఇరీనా కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది. దాంతో షెర్బో శిక్షణ మానేసి భార్య దగ్గరే ఉన్నాడు. నెల రోజుల తర్వాత భార్య కోమాలో నుంచి బయటకు రావడం... అట్లాంటా ఒలింపిక్స్‌లో కచ్చితంగా పాల్గొనాలని ఆమె షెర్బోను కోరడంతో అతను మళ్లీ ప్రాక్టీస్ చేశాడు. అయితే తగినంత సమయం లేకపోవడంతో సరైన సాధన చేయకుండానే అట్లాంటా ఒలింపిక్స్‌లో బెలారస్ దేశం తరఫున పాల్గొన్న షెర్బో నాలుగు కాంస్య పతకాలను సాధించాడు. తన ఒలింపిక్ కెరీర్‌ను పది పతకాలతో ముగించాడు.
 
వీళ్లనూ మరువలేం...
ఫెల్ప్స్, లారిసా, నాడియా, జెస్సీ ఓవెన్స్, షెర్బోలతోపాటు ఎంతోమంది ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించిన వారు ఉన్నారు. వీరిలో కార్ల్ లూయిస్, రా ఎవ్రీ, ఎడ్విన్ మోజెస్, మైకేల్ జాన్సన్ (అథ్లెటిక్స్, అమెరికా), నికోలాయ్ అడ్రియనోవ్, బోరిస్ షాక్‌లిన్ (జిమ్నాస్ట్, రష్యా), తకాషి ఒనో (జిమ్నాస్ట్, జపాన్), పావో నుర్మి,(అథ్లెటిక్స్, ఫిన్‌లాండ్), ఎమిల్ జటోపెక్  (అథ్లెటిక్స్, చెకోస్లొవేకియా), మార్క్ స్పిట్జ్, నటాలీ కులిన్, మాట్ బియాండీ (స్విమ్మింగ్, అమెరికా), డారా టోరెస్ (స్విమ్మింగ్, అమెరికా), ఫెలిక్స్ సవాన్ (బాక్సింగ్, క్యూబా), అలెగ్జాండర్ కరెలిన్ (రెజ్లింగ్, రష్యా), అబెబీ బికిలా, హెయిలీ గెబ్రెసెలాసీ, కెనెనిసా బెకెలే (అథ్లెటిక్స్, ఇథియోపియా), ఉసేన్ బోల్ట్ (అథ్లెటిక్స్, జమైకా) కూడా ఒలింపిక్స్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
 
జెస్సీ ఓవెన్స్
నల్ల బంగారం
...
ఎలాంటి ప్రచార్భాటాలు లేని రోజుల్లో ఒకే ఒక్క ఒలింపిక్స్‌లో పాల్గొని తిరుగులేని పేరు తెచ్చుకున్న అథ్లెట్ జెస్సీ ఓవెన్స్. అమెరికాకు చెందిన ఈ నల్ల జాతీయుడు 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలను సొంతం చేసుకొని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు గర్వభంగాన్ని చేశాడు. సొంతగడ్డపై జర్మనీ అథ్లెట్స్‌ను అలవోకగా ఓడించిన ఓవెన్స్ విజయాలను ఓర్వలేని హిట్లర్ అతనితో కరచాలనం  చేసేందుకు కూడా ఇష్టపడకుండానే మైదానాన్ని వీడారు. ఆగస్టు 3న 100 మీటర్ల రేసులో స్వర్ణాన్ని నెగ్గిన ఓవెన్స్, ఆగస్టు 4న లాంగ్‌జంప్‌లో, ఆగస్టు 5న 200 మీటర్ల రేసులో, ఆగస్టు 9న 4ఁ100 మీటర్ల రిలేలో పసిడి పతకాలను దక్కించుకొని దుమ్మురేపాడు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 1944లలో ఒలింపిక్స్ జరగలేదు. లేదంటే జెస్సీ ఓవెన్స్ మరిన్ని అద్భుతాలు చేసేవాడు.  1981లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఓవెన్స్ మృతి చెందాడు.
 
లారిసా లాతినినా
కళ్లు చెదిరే విన్యాసాలు..

తమ శరీరాన్ని విల్లులా వంచి అబ్బురపరిచే విన్యాసాలు చేయడంలో జిమ్నాస్ట్‌లకు తిరుగులేదు. ఒకప్పటి సోవియట్ యూనియన్‌కు చెందిన లారిసా లాతినినా తన అద్వితీయ ప్రతిభతో వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో (1956, 1960, 1964) బరిలోకి దిగి ఏకంగా 18 పతకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. ప్రస్తుతం 81 ఏళ్ల వయస్సున్న లారిసా వ్యక్తిగత విభాగంలో అత్యధికంగా 14 పతకాలు సాధించింది. ఒలింపిక్స్‌లో ఇప్పటికీ ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. ఫెల్ప్స్ వ్యక్తిగత విభాగంలో 13 పతకాలు సాధించి లారిసా రికార్డుకు చేరువలో ఉన్నాడు.
 

మరిన్ని వార్తలు