శ్రీనిపై విచారణ జరిపిస్తాం

5 May, 2015 02:43 IST|Sakshi
శ్రీనిపై విచారణ జరిపిస్తాం

బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ:
క్రికెట్ ప్రక్షాళనలో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్.శ్రీనివాసన్ వ్యవహార శైలిపై విచారణ జరిపించే అవకాశం ఉన్నట్టు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సూచించారు. వీరిద్దరి మధ్య ఇటీవలి కాలంలో ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. బుకీతో తనకు సంబంధాలున్నాయని ఐసీసీ పేర్కొనడం వెనుక శ్రీని ఉన్నాడని ఆయన ఆరోపించారు.

అలాగే బోర్డు అధికారులపై నిఘా ఉంచేందుకు బ్రిటిష్ ఏజెన్సీతో శ్రీని రూ.14 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కథనాలు వెలువడ్డాయి. ‘బోర్డు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహార శైలిపై విచారణ జరగాల్సి ఉంది. దీనికి ఎస్‌జీఎంను ఉపయోగించుకోవచ్చు. సాక్ష్యాలేమైనా లభిస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం. ఈ సెప్టెంబర్ వరకు బీసీసీఐ నుంచి ఐసీసీలో శ్రీనివాసన్ నామినీగా ఉంటారు. ఆ తర్వాత ఆయన కొనసాగేదీ.. లేనిదీ.. తేలుస్తాం’ అని ఠాకూర్ అన్నారు.
 

మరిన్ని వార్తలు