ఒకే పార్శ్వంలో ఆ ముగ్గురు

27 Jun, 2015 02:15 IST|Sakshi
ఒకే పార్శ్వంలో ఆ ముగ్గురు

లండన్ : ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఈసారి ముగ్గురు మాజీ చాంపియన్స్ రోజర్ ఫెడరర్, ఆండీ ముర్రే, రాఫెల్ నాదల్ ఒకే పార్శ్వంలో ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే క్వార్టర్ ఫైనల్లో ముర్రే (బ్రిటన్)తో నాదల్ (స్పెయిన్) తలపడవచ్చు. ఈ మ్యాచ్‌లో నెగ్గినవారు సెమీఫైనల్లో ఫెడరర్ (స్విట్జర్లాండ్)తో ఆడే అవకాశముంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు సెమీఫైనల్ వరకు సులువైన ‘డ్రా’ పడింది. జొకోవిచ్‌కు సెమీస్‌లో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది. సోమవారం మొదలయ్యే వింబుల్డన్ టోర్నమెంట్‌కు సంబంధించి ‘డ్రా’ను శుక్రవారం విడుదల చేశారు.

 సెరెనా దారిలో షరపోవా
 మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), షరపోవా (రష్యా) ఒకే పార్శ్వంలో ఉన్నారు. వీరిద్దరూ సెమీఫైనల్లో తలపడే అవకాశముంది. అంతకుముందే నాలుగో రౌండ్‌లో తన సోదరి వీనస్‌తో సెరెనా ఢీకొనే చాన్స్ ఉంది. మరో పార్శ్వం నుంచి డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) సెమీఫైనల్ చేరే అవకాశముంది.‘డ్రా’ విడుదలకు ముందు గురువారం రాత్రి జరిగిన క్రీడాకారిణుల పార్టీలో షరపోవా, సెరెనా, ఇవనోవిచ్‌లతోపాటు క్విటోవా, అజరెంకా, లిసికి, యూజిన్ బౌచర్డ్ తదితర స్టార్ ప్లేయర్లు ఫ్యాషన్ దుస్తులతో సందడి చేశారు.

మరిన్ని వార్తలు