నెల రోజుల ప్రాక్టీస్‌ ఉండాల్సిందే!

7 May, 2020 05:21 IST|Sakshi
అజింక్య రహానే

భారత క్రికెటర్‌ రహానే

న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయి క్రికెట్‌ టోర్నీల్లో పాల్గొనే ముందు క్రికెటర్లకు కనీసం నెల రోజుల ప్రాక్టీస్‌ అవసరమని భారత టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాకే ఆటల్ని పునఃప్రారంభించాలని సూచించాడు. బుధవారం ఎల్సా కార్ప్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడైన రహానే మాట్లాడుతూ... ఇకనుంచి మైదానంలో ఆటగాళ్లు ముందులా సంబరాలు చేసుకునే అవకాశం ఉండబోదని చెప్పాడు.

‘ఏ స్థాయి క్రికెట్‌ ఆడాలన్నా క్రికెటర్లకు 3 నుంచి 4 వారాల కఠిన ప్రాక్టీస్‌ అవసరం. నావరకైతే ఆటను చాలా మిస్‌ అవుతున్నా. కానీ వ్యాక్సిన్‌ వచ్చాకే టోర్నీలు ప్రారంభిస్తే మంచిది. కరోనా కట్టడి అయ్యాక కూడా మనం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించకూడదు. అభిమానులు, ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతా సద్దుమణిగాక కూడా మైదానంలో మా సంబరాలు మునుపటిలా ఉండకపోవచ్చు. ప్రయాణాల్లో, వికెట్‌ తీసినప్పుడు మేం చప్పట్లు, నమస్కారాలతో సరిపెట్టుకుంటామేమో. ఇక బంతిని మెరిపించేందుకు లాలాజలం వాడాలా? వద్దా? అనే అంశంపై ఆట ప్రారంభమయ్యాకే స్పష్టత వస్తుందని’ రహానే చెప్పాడు.  

>
మరిన్ని వార్తలు