ఇదొక చెత్త అనుభవం: డుప్లెసిస్‌

21 Sep, 2019 13:58 IST|Sakshi

దుబాయ్‌: దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టుతో కలిసేందుకు భారత్‌కు వస్తున్న ఆ దేశ  టెస్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌కు చేదు అనుభవం ఎదురైంది. భారత్‌కు వచ్చే క్రమంలో విమానం మిస్‌ కావడం డుప్లెసిస్‌కు విపరీతమైన కోపం తెప్పించింది. ఇది తన విమాన ప్రయాణాల్లో ఒక అత్యంత చెత్త అనుభవంగా వర్ణించేంతంగా డుప్లెసిస్‌ అసహనం వ్యక్తం చేశాడు. ‘నేను  దుబాయ్‌ రావడానికి నాలుగు గంటలు ఆలస్యమైంది. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ విమానం బాగా ఆలస్యంగా వచ్చింది. దాంతో నేను భారత్‌కు వెళ్లే ఫ్లైట్‌ను దుబాయ్‌లో అందుకోలేకపోయాను. 

నాకు తదుపరి విమానం 10 గంటల తర్వాత ఉంది. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ నిర్వాకానికి దుబాయ్‌ నుంచి భారత్‌ వెళ్లే విమానం మిస్‌ అయ్యాను. నాకు ఇదొక చెత్త అనుభవం. నా విమాన ప్రయాణంలో ఏదీ సాఫీగా సాగలేదు’ అని డుప్లెసిస్‌ ట్వీట్‌ చేశాడు. ఇక భారత్‌తో టెస్టు సిరీస్‌లో తన బ్యాట్‌ మాట్లాడుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు.భారత్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య విశాఖలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో అక్టోబర్‌2వ తేదీన తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టులో కలిసేందుకు డుప్లెసిస్‌ పయనమయ్యాడు.

భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన డుప్లెసిస్‌.. దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్‌. ఇప్పటికే భారత్‌తో టీ20 సిరీస్‌లో వెనుకబడ్డ సఫారీలు.. మూడో టీ20 గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తున్నారు. అదే సమయంలో రెండో టీ20లో విజయాన్ని రిపీట్‌  చేసి సిరీస్‌ను సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇప్పటివరకూ  దక్షిణాఫ్రికాపై సొంత గడ్డపై భారత్‌ టీ20 సిరీస్‌ను గెలవని నేపథ్యంలో మూడో టీ20ని కోహ్లి సేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.

>
మరిన్ని వార్తలు