‘ఆ రికార్డు కోహ్లి వల్ల కూడా కాదు’

22 Aug, 2019 15:28 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వారసుడిగా మన్ననలు అందుకోవడమే కాకుండా అదే స్థాయిలో రికార్డుల మోత మోగిస్తున్న క్రికెటర్‌ ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.  ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుని క్రికెట్‌లో ప్రత్యేక ముద్ర వేసిన కోహ్లి.. సచిన్‌ టెండూల్కర్‌ సాధించిన 100 అంతర్జాతీయ వన్డే సెంచరీలను కూడా బ్రేక్‌ చేస్తాడని క్రికెట్‌ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే కోహ్లి 68 అంతర్జాతీయ సెంచరీలు చేయడంతో సచిన్‌ అత్యధిక సెంచరీల రికార్డు ఏమంత కష్టం కాకపోవచ్చు. ఇంకా కోహ్లికి చాలా కెరీర్‌ ఉన్నందున సచిన్‌ ఆల్‌ టైమ్‌ సెంచరీల రికార్డును ఈజీగానే అధిగమిస్తాడనేది సగటు ప్రేక్షకుడి అభిప్రాయం.

అయితే కోహ్లి ఎన్ని రికార్డులు నెలకొల్పినా ఒక రికార్డును మాత్రం బ్రేక్‌ చేయలేడని భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. దాదాపు కోహ్లికి చాలెంజ్‌ చేసినంత పని చేసిన సెహ్వాగ్‌.. ఆ సచిన్‌ రికార్డు మాత్రం ఎవ్వరీ వల్ల కాదంటున్నాడు. ఇంతటీ ఆ రికార్డు ఏమిటంటే.. సచిన్‌ టెండూల్కర్‌ రెండొందల టెస్టు మ్యాచ్‌ల రికార్డు. ‘ అది ఎవ్వరూ బ్రేక్‌ చేయలేని రికార్డు. 200 టెస్టు మ్యాచ్‌ల సచిన్‌ రికార్డును అధిగమించడం ఈతరం క్రికెటర్ల వల్ల కాదు. దీని దరిదాపులకు కూడా ఎవరూ వస్తారని కూడా అనుకోవడం లేదు. ఈ శకంలో మేటి క్రికెటర్‌ కోహ్లి కూడా ఆ రికార్డు బ్రేక్‌ చేయలేడు’ అని సెహ్వాగ్‌ స్పష్టం చేశాడు. ఇప‍్పటివరకూ కోహ్లి 77 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇదిలా ఉంచితే, సచిన్‌ టెండూల్కర్‌ వన్డే సెంచరీలు(49)కి  స్వల్ప దూరంలో ఉన్న కోహ్లిని సెహ్వాగ్‌ ప్రశంసించాడు. సచిన్‌ వన్డే సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్‌ చేయడానికి ఎంతో సమయం పట్టదని పేర్కొన్నాడు. ప్రస్తుతం కోహ్లి 43 వన్డే సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. (ఇక్కడ చదవండి: నేనైతే వారినే ఎంపిక చేస్తా: సెహ్వాగ్‌)

మరిన్ని వార్తలు