ఆసీస్‌ను ఓడించడం వారికే సాధ్యం: వాన్‌

2 Dec, 2019 17:44 IST|Sakshi

అడిలైడ్‌: ఆస్ట్రేలియాలో ఆసీస్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఒక్క విజయం కూడా లేకుండా ముగించడంతో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ స్పందించాడు. ప్రస్తుతం ఆసీస్‌ క్రికెట్‌ జట్టు ఉన్న పరిస్థితుల్లో వారిని ఏ జట్టుకైనా ఓడించడం అంత ఈజీ కాదన్నాడు. అందులోనూ ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించడమంటే అది మరింత కఠినతరమన్నాడు. కాకపోతే ప్రపంచ క్రికెట్‌లో ఉన్న ప్రస్తుత జట్లలో ఆసీస్‌ను ఆస్ట్రేలియాలో ఓడించే సత్తా టీమిండియాకే ఉందన్నాడు. (ఇక్కడ చదవండి:20 ఏళ్లలో ఒక్క టెస్టు కూడా గెలవలేదు..!)

ఈ మేరకు తన ట్వీటర్‌ అకౌంట్‌లో టీమిండియా ప్రదర్శనను ప్రస్తావించాడు. ‘ కేవలం ఆసీస్‌ను వారి దేశంలో ఓడించాలంటే టీమిండియాకే సాధ్య. ఆసీస్‌కు ధీటైన సవాల్‌ విసిరే జట్టు భారత్‌. ప్రస్తుతం టీమిండియా చాలా పటిష్టంగా ఉంది. ఆసీస్‌కు గట్టిపోటీ ఇచ్చే జట్టు కచ్చితంగా టీమిండియా ఒక్కటే’ అని వాన్‌ పేర్కొన్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆసీస్‌ 2-0తో కైవసం చేసుకుంది. అందులో ఒక టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. ఇక రెండు టెస్టుల సిరీస్‌ను ఆసీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ రెండు టెస్టుల్లోనూ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ విజయాలు సాధించి పాక్‌ను మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను ఓడించడం​ టీమిండియాకే సాధ్యమవుతుందన్నాడు.

మరిన్ని వార్తలు