మంధాన మెరుపులు.. భారత్‌ ఘన విజయం

24 Jan, 2019 12:43 IST|Sakshi

నేపియర్‌: న్యూజిలాండ్‌ మహిళలతో జరిగిన తొలి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు 33.0 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించారు. భారత ఓపెనర్లు స్మృతీ మంధాన( 105;104 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం సాధించగా, జమీమా రోడ్రిగ్స్‌(81 నాటౌట్‌; 94 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నారు. ఈ జోడి తొలి వికెట్‌కు 190 పరుగులు జోడించి భారత్‌ ఘన విజయం సాధించడంలో సహకరించారు. న్యూజిలాండ్‌ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంధాన, రోడ్రిగ్స్‌లు ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే మంథాన సెంచరీతో మెరవగా, రోడ్రిగ్స్‌ అర్థ శతకం నమోదు చేశారు. కాగా, భారత్‌ విజయానికి మూడు పరుగుల దూరంలో ఉండగా మంధాన భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరారు.

 అంతకుముందు న్యూజిలాండ్‌ 48.4 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. టాస్‌ గెలిచిన భారత్‌.. ముందుగా కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో బ్యాటింగ్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు సుజీ బేట్స్‌(36), సోఫీ డివైన్‌(28)లు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన తర్వాత సోఫీ డివైన్‌ పెవిలియన్‌ చేరారు. ఆపై ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన లారెన్‌ డౌన్‌ డకౌట్‌గా ఔటయ్యారు. కాసేపటికి సుజీ బేట్స్‌ కూడా పెవిలియన్‌ బాట పట్టడంతో కివీస్‌ 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు తర్వాత సాటెర్‌వైట్‌(31), అమీలా కెర్‌(28)లు 49 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో కివీస్‌ తేరుకుంది. వీరిద్దరూ 17 పరుగుల వ్యవధిలో ఔట్‌ కావడంతో మళ్లీ కివీస్‌ పరిస్థితి మొదటికొచ‍్చింది. చివర్లో హనహ్‌ రోవ్‌(25) ఫర్వాలేదనిపించారు.  ఏక్తాబిస్త్‌, పూనమ్‌ యాదవ్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, దీప్తి శర్మ రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. శిఖా పాండేకు వికెట్‌ దక్కింది.

>
మరిన్ని వార్తలు