నయోమి  నవ్వింది

27 Jan, 2019 01:41 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌  విజేత నయోమి ఒసాకా

హోరాహోరీ ఫైనల్లోక్విటోవాపై విజయం 

రూ. 20 కోట్ల 87 లక్షల  ప్రైజ్‌మనీ సొంతం

కెరీర్‌లో వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వశం 

తొలిసారి నంబర్‌వన్‌  ర్యాంక్‌ హస్తగతం  

నాలుగు నెలల క్రితం యూఎస్‌ ఓపెన్‌లో అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ను ఓడించినప్పటికీ జపాన్‌ అమ్మాయి నయోమి ఒసాకా ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోయింది. నాటి ఫైనల్లో చైర్‌ అంపైర్‌ను తీవ్రంగా దూషించిన సెరెనా అక్కడి వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చేసింది. ఒసాకా విజయంకంటే సెరెనా ప్రవర్తనే అక్కడ హైలైట్‌ అయ్యింది. ఫైనల్‌ను వీక్షించిన ప్రేక్షకులు కూడా ఒసాకా విజయాన్ని అంగీకరించకుండా ఆమెను గేలి చేశారు. సీన్‌ కట్‌ చేస్తే... నాడు సెరెనాపై తాను సాధించిన విజయం గాలివాటమేమీ కాదని ఒసాకా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నిరూపించింది. రెండుసార్లు వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన క్విటోవాపై ఈసారి ఫైనల్లో గెలిచింది. కెరీర్‌లో వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. ‘గ్రాండ్‌’ విజయంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌నూ దక్కించుకుంది. విజయానంతరం చిరునవ్వులు చిందిస్తూ, తనివితీరా ఆస్వాదిస్తూ ఈ క్షణాలను నయోమి ఒసాకా చిరస్మరణీయం చేసుకుంది.   

మెల్‌బోర్న్‌: టైటిల్‌ ఫేవరెట్స్‌ అందరూ ముందే నిష్క్రమించగా... పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జపాన్‌ యువతార నయోమి ఒసాకా మళ్లీ అద్భుతం చేసింది. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకుంది. రాడ్‌ లేవర్‌ ఎరీనాలో శనివారం 2 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్‌ ఒసాకా 7–6 (7/2), 5–7, 6–4తో ఎనిమిదో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. విజేత ఒసాకాకు 41 లక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 20 కోట్ల 87 లక్షలు)... రన్నరప్‌ క్విటోవాకు 20 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 10 కోట్ల 43 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ విజయంతో 21 ఏళ్ల ఒసాకా సోమవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకోనుంది. ఈ క్రమంలో ఆసియా నుంచి ఈ ఘనత సాధించనున్న తొలి ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించనుంది.  

మూడు మ్యాచ్‌ పాయింట్లు చేజార్చుకొని... 
గతేడాది యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో దిగ్గజ క్రీడాకారిణి సెరెనాను ఓడించి పెను సంచలనం సృష్టించిన ఒసాకా ఆ తర్వాత మరో నాలుగు టోర్నీల్లో ఆడినా టైటిల్‌ గెలవలేకపోయింది. అయితే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మాత్రం ఆద్యంతం నిలకడగా ఆడుతూ ఫైనల్‌ చేరింది. క్విటోవాతో జరిగిన తుది సమరంలోనూ ఆమె తన జోరు కొనసాగించింది. తొలి సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో ఒసాకా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో క్విటోవా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లిన ఒసాకా... క్విటోవా సర్వ్‌ చేసిన తొమ్మిదో గేమ్‌లో మూడు మ్యాచ్‌ పాయింట్లను సంపాదించింది. అయితే క్విటోవా ఈ మూడింటిని కాపాడుకుంది. అనంతరం పదో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి స్కోరును 5–5తో సమం చేసింది. మళ్లీ 12వ గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఈ చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌ రెండో సెట్‌ను 7–5తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లోని మూడో గేమ్‌లో క్విటోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఒసాకా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత క్విటోవా స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా ఒసాకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని ఒసాకా మూడో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. 

ట్రోఫీ ప్రదానోత్సవం జరుగుతున్నంతసేపూ ఇది కలయా నిజమా అన్న భావనలో ఉండిపోయా. రెండో సెట్‌లో మూడు మ్యాచ్‌ పాయింట్లు కోల్పోయినపుడు నిరాశచెందా. అయితే జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగాల్సిన దానిపై దృష్టి పెట్టా. అనవసరంగా ఆందోళన చెందకుండా పరిణతితో ఆడాల్సిన అవసరం ఉందని మనసులో అనుకొని దానిని అమలు చేశా. అనుకున్న ఫలితాన్ని సాధించా. 
– నయోమి ఒసాకా

విశేషాలు 
జెన్నిఫర్‌ కాప్రియాటి (అమెరికా–2001లో) తర్వాత కెరీర్‌లోని తొలి రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను వరుసగా నెగ్గిన రెండో క్రీడాకారిణిగా ఒసాకా గుర్తింపు పొందింది. కాప్రియాటి కంటే ముందు క్రిస్‌ ఎవర్ట్‌ (అమెరికా), ఇవోన్‌ గూలగాంగ్‌ (ఆస్ట్రేలియా), హానా మాండ్లికోవా (చెక్‌ రిపబ్లిక్‌), వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) ఈ ఘనత సాధించారు. 

మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌–1998లో) తర్వాత బ్యాక్‌ టు బ్యాక్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన పిన్న వయస్కురాలిగా... 2010లో కరోలైన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌) తర్వాత పిన్న వయస్సులో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకోనున్న క్రీడాకారిణిగా ఒసాకా నిలిచింది.

నేడు పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌

నాదల్‌vsజొకోవిచ్‌
మధ్యాహ్నం గం. 2 నుంచి  సోనీ సిక్స్, సోనీ టెన్‌–2లలో ప్రత్యక్ష ప్రసారం  

మరిన్ని వార్తలు