'మా అల్లుడికి కఠిన శిక్ష వేయండి'

14 Jun, 2016 19:48 IST|Sakshi
'మా అల్లుడికి కఠిన శిక్ష వేయండి'

తన కూతుర్ని హత్య చేసిన పిస్టోరియస్ కు కచ్చితంగా తగిన శిక్ష పడాలని మోడల్ అయిన రీవా స్టీన్ కాంప్ తండ్రి బార్రీ స్టీన్ కాంప్ విజ్ఞప్తి చేశాడు. ప్రియురాలి హత్య కేసులో దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు దక్షిణాఫ్రికా హైకోర్టు గతంలో 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నేడు ఆ కేసు విచారణకు వచ్చింది. 2013లో వాలెంటైన్స్ డే రోజు రీవా స్టీన్ కాంప్ ను హత్య చేశాడని గతంలో నిరూపితమైంది. ఒక ఏడాది జైలులో గడిపిన పిస్టోరియస్ ఈ హత్య చేసినందుకు తాను సిగ్గు పడుతున్నానని, శిక్ష తగ్గించాలని కోరుతూ గతేడాది డిసెంబర్ లో దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

తాను ఉద్దేశపూర్వకంగా హత్యచేయలేదని, ఇంట్లోకి ఎవరో దొంగ ప్రవేశించాడని భావించి కాల్పులు జరిపగా ప్రియురాలు రక్తపు మడుగులో పడిపోయిందని కేసు తొలి విచారణలో చెప్పాడు. బుల్లెట్లు తగిలినప్పుడు నా కూతురు ఎంత భయాన్ని, బాధను అనుభవించిందో ప్రతిక్షణం అదే తనకు గుర్తుకువస్తున్నాయని బార్రీ స్టీన్ కాంప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కచ్చితంగా ఆరోజు వారిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని, ఆ ఆవేశంలోనే కాల్పులు జరిపి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. తన భార్య ఫోన్ చేసి వణుకుతున్న స్వరంతో కూతురి మరణవార్తను చెప్పిందని, ఆ క్షణంలో జరిగిన ప్రతి విషయాన్ని కోర్టులో వివరించారు. తన కూతుర్ని హత్య చేసినందుకు పిస్టోరియస్ కు మాత్రం కఠిన శిక్ష వేయాలంటూ ప్రధాన న్యాయమూర్తిని కోరాడు.

మరిన్ని వార్తలు