ఓయూ మహిళల టెన్నిస్‌ జట్టుకు స్వర్ణం 

1 Mar, 2020 03:06 IST|Sakshi

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌

భువనేశ్వర్‌: తొలిసారి నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల్లో ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌) జట్టుకు మొదటి స్వర్ణ పతకం లభించింది. టెన్నిస్‌ ఈవెంట్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు చాంపియన్‌గా అవతరించింది. గుజరాత్‌ యూనివర్సిటీతో జరిగిన ఫైనల్లో చిలకలపూడి శ్రావ్య శివాని, కొండవీటి అనూష, నిధిత్రలతో కూడిన ఓయూ జట్టు 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో అనూష 4–6, 6–7 (3/7)తో దీప్షిక షా చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌లో శ్రావ్య 6–0, 7–6 (9/7)తో ఈశ్వరి గౌతమ్‌ సేథ్‌ను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్‌ మ్యాచ్‌లో శ్రావ్య–అనూష 6–4, 6–2తో దీప్షిక–ఈశ్వరిలను ఓడించి ఓయూ జట్టుకు స్వర్ణాన్ని అందించారు.

స్నేహకు కాంస్యం

అథ్లెటిక్స్‌ మహిళల 100 మీటర్లలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్‌) అథ్లెట్‌ ఎస్‌.ఎస్‌.స్నేహ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. స్నేహ 12.08 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఒడిశాకు చెందిన అంతర్జాతీయ అథ్లెట్‌ ద్యుతీ చంద్‌ (కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ) స్వర్ణం గెలిచింది. ద్యుతీ చంద్‌ 11.49 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది.  ఎస్‌.ధనలక్ష్మి (11.99 సెకన్లు–మంగళూరు యూనివర్సిటీ) రజత పతకాన్ని దక్కించుకుంది.

మరిన్ని వార్తలు