మా కమిటీ సరైనదే!

3 Aug, 2013 01:21 IST|Sakshi
మా కమిటీ సరైనదే!

న్యూఢిల్లీ: ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంపై ద్విసభ్య కమిషన్ ఏర్పాటును తప్పు పట్టిన బాంబే హైకోర్టు తీర్పుపై బీసీసీఐ సుప్రీం కోర్టుకు వెళ్లనుంది. బోర్డు అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాల బెట్టింగ్ వ్యవహారాన్ని ఈ ప్యానెల్ విచారించింది. తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా వీరికి క్లీన్‌చిట్ ఇస్తూ రిటైర్డ్ జడ్జిలతో కూడిన ఈ ప్యానెల్ బోర్డుకు నివేదిక ఇచ్చింది.
 
 దీంతో బీహార్ క్రికెట్ అసోసియేషన్ ఈ వ్యవహారంపై బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. బోర్డు నియమించిన ద్విసభ్య కమిటీ అనైతికమని, రాజ్యాంగబద్ధం కానిదని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో శ్రీనివాసన్ బోర్డు అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేసేందుకు బీసీసీఐ సిద్ధమయింది. ‘శుక్రవారం జరిగిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో విచారణ కమిషన్ రాజ్యాంగబద్ధతపై బాంబే హైకోర్టు తీర్పు గురించి చర్చించాం.
 
 ఈ కమిటీ కోసం పాలక మండలి తీసుకున్న చర్యలు న్యాయపరమైనవి, నైతికపరమైనవని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ పరిపాలన నిబంధనలకు అనుగుణంగానే ప్యానెల్ ఏర్పాటైంది. హైకోర్టు తీర్పులోని ముఖ్య విషయాలను ప్రముఖ న్యాయవాది, ఉపాధ్యక్షుడు అరుణ్ జైట్లీ సమావేశంలో సోదాహరణంగా వివరించారు. దీంతో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) వేయాలని నిర్ణయించాం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ ఓ ప్రకటనలో వివరించారు. సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో శ్రీనివాసన్ బయటకు వెళ్లి తిరిగి వచ్చారు.
 శ్రీనివాసన్‌కు ‘బ్రేక్’
 బీసీసీఐ పాలనా పగ్గాలు అందుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న ఎన్.శ్రీనివాసన్‌కు మరోసారి బ్రేక్ పడింది. శుక్రవారం జరగాల్సిన బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అధ్యక్షత వ హిస్తానని చెప్పినప్పటికీ ఆ మీటింగ్ రద ్దయ్యింది. తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారంపై ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిషన్ విచారణను బాంబే హైకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే.
 
 అయితే ఈ ప్యానెల్ ఇచ్చే తీర్పును ఆసరా చేసుకుని తిరిగి బోర్డు అధ్యక్ష పదవి చేపట్టేందుకు శ్రీనివాసన్ రంగం సిద్ధంచేసుకున్నారు. కానీ వర్కింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తే న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయనే కారణంతో సమావేశాన్ని రద్దు చేసినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న జగ్మోహన్ దాల్మియా మరికొంత కాలం ఆ బాధ్యతలో కొనసాగనున్నారు. అంతకుముందు బోర్డు ఉన్నతాధికారులు తీవ్రంగా చర్చలు జరిపారు.
 
 ఈ పరిస్థితిలో శ్రీనివాసన్ తిరిగి బోర్డు పగ్గాలు చేపడితే తిరుగుబాటు జరిగే అవకాశాలున్నాయనే కారణంతో రద్దు చేశారు. వర్కింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తే మరిన్ని లీగల్ సమస్యలు వెంటాడుతాయని బోర్డు భావించింది. ఈనేపథ్యంలో శ్రీని నిర్ణయాన్ని మార్చేందుకు ఉపాధ్యక్షుడు అరుణ్ జైట్లీ, దాల్మియా, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తీవ్రంగా ప్రయత్నించారని బోర్డు వర్గాల సమాచారం. మరోవైపు శ్రీని అధ్యక్షత వహిస్తే ఇద్దరు ఉపాధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలపై ఆయన అసహనం వ్యక్తం చేసినా తన న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం మీటింగ్‌ను రద్దు చేయడమే మేలని భావించారు.
 
 సాంకేతిక తప్పిదంతోనే...
 అయితే బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం రద్దు వెనుక సాంకేతిక తప్పిదం కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. సమావేశం గురించి సభ్యులకు పంపిన సర్క్యులర్‌లో ‘అత్యవసర’ అనే పదం లేకపోవడంతో రద్దు చేయాల్సి వచ్చిందని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ఇప్పటికైతే గురునాథ్, రాజ్ కుంద్రా బెట్టింగ్ వ్యవహారాలపై మరో విచారణ కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచన బోర్డుకు లేదని స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు