ఐదేళ్లు మా ఆధిపత్యమే ఉండాలి

3 Jun, 2015 01:20 IST|Sakshi
ఐదేళ్లు మా ఆధిపత్యమే ఉండాలి

టెస్టు కెప్టెన్ కోహ్లి వ్యాఖ్య
 
 న్యూఢిల్లీ : ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు ఆధిపత్యం కనీసం ఐదేళ్ల పాటైనా కొనసాగాలని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కోరుకుంటున్నాడు. అలాగే జట్టు ఆటగాళ్లతో ధృడమైన స్నేహబంధాన్ని ఏర్పరుచుకోవాలనుకుంటున్నట్టు చెప్పాడు. ‘భారత ఆటగాళ్లలో నైపుణ్యానికి కొదవలేదు. మాకు నంబర్‌వన్‌గా నిలిచే సామర్థ్యం కూడా ఉంది. అందుకే కనీసం ఐదారేళ్లపాటైనా ప్రపంచ క్రికెట్‌పై భారత జట్టు ఆధిపత్యం కొనసాగాలని అనుకుంటున్నాను. అయితే ఆ స్థాయికి చేరాలంటే మన ప్రయత్నాలు కూడా సరైన రీతిలోనే ఉండాలి. అలాగే తోటి ఆటగాళ్లతో నా స్నేహం పటిష్టంగా ఉండాలనుకుంటున్నాను.

ఎందుకంటే ఏడాదిలో దాదాపు 290 రోజులైనా కలిసే ఉంటాం. అలాంటప్పుడు అందరి మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటేనే బాగుంటుంది. బయటి నుంచి చూసే వారు ఇది సమష్టి యూనిట్‌గా చెప్పుకోవాలి. వ్యక్తిగతంగా కాకుండా ఒకరి కోసం మరొకరు ఆడేలా ఉండాలి’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు బెదిరిపోకుండా ఓపిగ్గా ఎదురుచూడాల్సిందేనని సూచించాడు. ప్రపంచకప్ సెమీస్‌లో విఫలమైనందుకు అభిమానులు తన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారని, అయితే అలాంటి సమయంలో తమ కుటుంబాల మనోభావాలను కూడా అర్థం చేసుకోవాలని కోరాడు.

మరిన్ని వార్తలు