'మూడింటికీ' ఒక్కడు చాలు

14 Jan, 2017 00:46 IST|Sakshi
'మూడింటికీ' ఒక్కడు చాలు

మహేంద్ర సింగ్‌ ధోని మనసు విప్పాడు. దాదాపు రెండేళ్ల క్రితం టెస్టుల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన సమయంలో, ఇటీవల వన్డే, టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు కూడా తన నిర్ణయాలతో అందరికీ షాక్‌ ఇచ్చిన అతను, ఇప్పుడు ఆ విషయాల్లో తన అంతరంగాన్ని బయట పెట్టాడు. రెండు సందర్భాల్లోనూ సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వకుండా ఏకవాక్య ప్రకటనతోనే సరిపెట్టిన ధోని, నాయకత్వం నుంచి తప్పుకున్న తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చి తన ఆలోచనలు పంచుకున్నాడు.  

పుణే: భారత వన్డే, టి20 జట్ల కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవడం అనూహ్య నిర్ణయం ఏమీ కాదు. దాదాపు ఏడాది క్రితమే అతని మనసులో ఈ ఆలోచన వచ్చింది. అయితే మైదానంలో తాను తీసుకునే నిర్ణయాలలాగే దీని గురించి కూడా తీవ్ర మేధోమథనం చేసిన తర్వాతే అతను నిర్ణయం తీసుకున్నాడు. పరిస్థితులు ఆశించిన విధంగా అంతా అనుకూలంగా మారిన తర్వాత తన అవసరం లేదని భావించి బాధ్యతల భారం దించుకున్నాడు. ఈ విషయాలన్నీ ధోని స్వయంగా వెల్లడించాడు. ఇక ముందు తాను ఇచ్చే వంద సలహాలను కూడా తిరస్కరించే హక్కు కోహ్లికి ఉందన్న ధోని, శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాల్లోని విశేషాలు అతని మాటల్లోనే...

కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై...
2015 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ముగిసినప్పుడే నేను దానిని ఆఖరిదిగా భావించాను. అయితే వేర్వేరు కారణాలతో మరి కొన్ని సిరీస్‌లకు కూడా కెప్టెన్‌గా కొనసాగాను. ఆ తర్వాతే నేను కెప్టెన్‌గా ఉండదల్చుకోలేదని చాలా ముందుగానే బీసీసీఐకి చెప్పాను. వేర్వేరు ఫార్మాట్‌లకు వేర్వేరు కెప్టెన్లు అనే విధానాన్ని నేను నమ్మను. మన దేశంలో అది పనికి రాదు. నేను టెస్టుల నుంచి రిటైర్‌ అయిన సమయంలోనే దీనిపై నాకు స్పష్టత ఉంది. ఏ జట్టుకైనా నాయకుడంటే ఒక్కడే ఉండాలి.  

విరాట్‌ కోసమే ఆగాను...
పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు సరైన సమయం కోసం ఆగాను. 2014 డిసెంబర్‌లో కోహ్లి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నప్పుడే నా మనసులో ఆలోచన వచ్చేసింది. టెస్టుల్లో విరాట్‌ పని సులువయ్యే వరకు ఎదురు చూశాను. వరుస మ్యాచ్‌లలో విజయాలతో అతను కుదురుకున్నాడు. ఇది నేను తప్పుకునేందుకు తగిన సమయం. నా నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు మన జట్టులో మంచి ప్రతిభతో పాటు అనుభవం కూడా వచ్చేసింది. ఎంతో ఒత్తిడిలో కూడా అంతా బాగా ఆడుతున్నారు. ఈ జట్టుతో కోహ్లి నాకంటే ఎక్కువ విజయాలు సాధిస్తాడు. అన్ని ఫార్మాట్‌లలో రాణిస్తూ చరిత్రను మార్చగల సామర్థ్యం ఈ జట్టుకు ఉంది. నేను చాంపియన్స్‌ ట్రోఫీ వరకు ఉన్నా పెద్ద తేడా రాదు. అదే కోహ్లి అయితే ఇప్పటి నుంచి టోర్నీ వరకు జట్టును నడిపి విజేతగా నిలపగలడు.

కోహ్లితో సంబంధాలపై...
మా ఇద్దరి మధ్య మంచి ఆత్మీయత ఉంది. అవకాశం దొరికిన ప్రతీసారి మరింత మెరుగు పడేందుకు, మరింత ఎక్కువ సమర్థంగా తన ఆటను ప్రదర్శించేందుకు తాపత్రయ పడే వ్యక్తిత్వం అతనిది. అదే అతనిలో గొప్ప విషయం. మేమిద్దరం చాలా ఎక్కువగా మాట్లాడుకుంటాం. క్రికెట్‌పరంగా, ఆలోచనాపరంగా అతను ఎంతో ఎదిగాడు. ఇంకా ముందుకు దూసుకుపోతూనే ఉన్నాడు. ఇక ముందు కూడా అతనికి అండగా నిలుస్తాను.

మున్ముందు జట్టులో సభ్యుడిగా...
ఏ జట్టులోనైనా వికెట్‌ కీపర్‌ అంటే మరో మాట లేకుండా వైస్‌ కెప్టెన్‌లాంటివాడే. కెప్టెన్‌ ఆలోచనల ప్రకారం అతడికి ఏం అవసరమో చూసి అందుకు సహకరిస్తాను. కెప్టెన్‌గా మైదానంలో ఫీల్డింగ్‌ ఏర్పాటు చేసే సమయంలో కోహ్లి ఆలోచనలు ఎలా ఉన్నాయనే దానిపై ఇప్పటికే నేను అతనితో చర్చిం చాను కూడా. దీనిని నేను దృష్టిలో పెట్టుకుంటాను. అతడిని గందరగోళ పెట్టకుండా 100 సలహాలైనా ఇస్తాను. వాటన్నింటినీ తిరస్కరించే అధికారం అతనికుంది. ఎందుకంటే చివరకు అన్నింటికీ అతనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏం చేసినా భారత జట్టుకు మేలు చేయడం ముఖ్యం.

నాలుగో స్థానంలో ఆడటంపై...
నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో జట్టు కోసం నేను అదనపు బాధ్యత తీసుకోవాలని భావించి లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చేవాడిని. నాలుగో స్థానంలో ఆడటానికే నేను ప్రాధాన్యతనిస్తా. కానీ మరెవరైనా అక్కడ నాకంటే బాగా ఆడుతూ, జట్టుకు ఉపయోగపడితే మంచిదే. జట్టు అవసరాలను బట్టే నేను ఆడతాను. వ్యక్తుల కంటే టీమ్‌ ముఖ్యం.

టెస్టుల నుంచి తప్పుకోవడంపై...
సిరీస్‌ మధ్యలోనే నేను రిటైర్‌ కావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే లోతుగా ఆలోచిస్తే అది మంచి నిర్ణయం. ఎందుకంటే నేను ఒక టెస్టు అదనంగా ఆడితే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ అక్కడే జట్టుతో ఉన్న వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు ఆస్ట్రేలియా గడ్డపై మరో టెస్టులో బరిలోకి దిగడం ఎంతో ఉపకరిస్తుంది. మున్ముందు అతనే జట్టులో ఉంటాడు కాబట్టి విదేశీ పర్యటనల్లో ఈ అనుభవం పనికొస్తుంది. విరాట్‌ కెప్టెన్సీ గురించి కూడా ఇదే తరహాలో భావించాను.

కెప్టెన్సీ ప్రయాణంపై...
జీవితంలో ఫలానాది చేయలేకపోయాననే బాధ నాకు ఏ విషయంలోనూ లేదు. జట్టులో నాకంటే సీనియర్లతో కలిసి పని చేశాను. జూనియర్లతో కూడా మంచి ఫలితాలు సాధించాను. అడ్డంకులు ఎదురైనప్పుడు వాటిని అధిగమించిన సమయంలో సహజంగానే దృఢంగా మారతాం. ఈ ప్రయాణంలో చాలా ఎత్తుపల్లాలు ఉన్నాయి. దీని గురించి ఆలోచించినప్పుడల్లా నా మొహంపై చిరునవ్వు పూస్తుంది. కష్ట సమయంలో లేదా ఆనందంగా ఉన్నప్పుడు కూడా అన్నింటినీ ఒకే తరహాలో స్వీకరించాను.

కెప్టెన్‌గా పని చేసిన శైలిపై...
తన జట్టులోకి ఆటగాళ్ల సామర్థ్యం ఏమిటో తెలిసి ఉండటమే కెప్టెన్‌ ప్రధాన బాధ్యత. నాయకుడు వాస్తవికంగా ఆలోచించాలి. నిజాయితీగా ఉండాలి. ఒక్కో వ్యక్తి నుంచి వేర్వేరుగా ఎలా పని రాబట్టాలో, ఏది జట్టుకు పనికొస్తుందో గుర్తించాలి. ఆ ఆటగాడు వంద శాతం శ్రమించేలా ప్రోత్సహించాలి. కొందరిని మామూలు మాటలతో చెబితే, మరికొందరితో గట్టిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరికొందరికి కళ్లతో అలా సైగ చేస్తే చాలు. కొన్నిసార్లు వరుసగా విఫలమైన ఆటగాళ్లపై నమ్మకం ఉంచాల్సి వస్తుంది. కీలకమైన మ్యాచ్‌లలో జట్టును గెలిపించే ఆటగాడిని గుర్తించడం అవసరం.

మరిన్ని వార్తలు