గంభీర్‌ 150 కొట్టినా సంతోషపడేవాడు కాదు

1 May, 2019 18:02 IST|Sakshi

కేప్‌టౌన్‌ : టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ 150 పరుగులు చేసినా సంతోషంగా ఉండేవాడు కాదని, ఎప్పుడు నిరాశవాదిగా అభద్రతాభావంతో ఉండేవాడని టీమిండియా మాజీ మానసిక నిపుణుడు ప్యాడీ ఆప్టన్‌ తెలిపారు. ఇటీవల ఆయన రాసిన ‘ది బేర్‌ఫుట్ కోచ్’ అనే పుస్తకంలో ఆటగాళ్ల మానసిక దృఢత్వం, సందర్భాన్ని బట్టి వాళ్లు ఎలా వ్యవహరించారనే విషయాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గంభీర్‌ ఓ నిరాశవాదని, అపాయకరమైన, ప్రతికూలమైన వ్యక్తని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. గంభీర్ మానసిక పరిస్థితిని మెరుగుపరచడానికి తాను చాలా ప్రయత్నాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. 2009లో అతను టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యేంతవరకూ కష్టపడ్డానని, ఇంకొంచం శ్రమించి ఉంటే.. అతను ప్రపంచంలోనే ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ అయ్యేవాడని తెలిపాడు. ఇక కోచ్ గ్యారీ క్రిస్టన్, తాను ఎంతకష్టపడ్డా గంభీర్ నిరాశగా, ప్రతికూలంగా ఉండేవాడన్నారు. గంభీర్ సెంచరీ సాధించినా.. అతనికి తృప్తి ఉండేది కాదని, ఎప్పుడు అతను తాను చేసిన తప్పులను గుర్తు చేసుకొని మనోవేదన గురయ్యేవాడన్నాడు.

ఇక మాజీ కెప్టెన్, విస్టర్‌కూల్‌ ఎంఎస్ ధోని అంటే తనకు ఎనలేని గౌరవమని రాసుకొచ్చాడు. అతనికి తన భావాలపై నియంత్రణ ఉంటుందని, వెంటనే భావోద్వేగానికి గురికాడన్నాడు. అలా అని అతనికి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవని కాదని, కానీ వాటిని నియంత్రించడం.. అతనికి పుట్టుకతోనే వచ్చిందని పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు