ఆసీస్‌-ఇంగ్లండ్‌ క్రికెటర్ల వాగ్వాదం

15 Sep, 2019 11:13 IST|Sakshi

లండన్‌: యాషెస్‌ సిరీస్‌ చివరి దశకు వచ్చేసరికి ఆసీస్‌-ఇంగ్లండ్‌ క్రికెటర్లు నియంత్రణ కోల్పోతున్నారు. ఎలాగైనా సిరీస్‌ గెలవాలనే కసితో ఆసీస్‌.. కనీసం సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లండ్‌ జట్లు చివరి టెస్టులో తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరు జట్ల ఆటగాళ్లు స్లెడ్జింగ్‌ చేసుకోవడం చర్చనీయాంశమైంది.  ఏ గేమ్‌లోనైనా స్లెడ్జింగ్‌ అనేది సాధారణమే అయినా,  అది హద్దులు దాటితే మాత్రం అసహ్యంగా ఉంటుంది. ఈ తరహానే డేవిడ్‌ వార్నర్‌ను బెన్‌ స్టోక్స్‌ దూషించాడు. మూడో రోజు ఆట లంచ్‌ బ్రేక్‌ సమయంలో వార్నర్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతాన్ని గుర్తు చేస్తూ అసభ్యకర పదజాలాన్ని వాడాడు.

ఫీల్డ్‌లో కూడా అతి చేశారు ఇరు జట్ల క్రీడాకారులు.  ప్రధానంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌-ఆసీస్‌ క్రికెటర్‌ మాథ్యూ వేడ్‌లు ఇద్దరూ మాటల యుద్ధానికి దిగారు.  జో రూట్‌కు వద్దకు వెళ్లి మరీ వేడ్‌ మాటను తూలాడు. దీనికి రూట్‌ కూడా అంతే వేగంగా స్పందించడంతో వారిద్దరి మధ్య వాడి వేడిగా వాగ్వాదం జరిగింది. దాంతో  ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైనీ కల్పించుకుని ఇద్దర్నీ సముదాయించడంతో పరిస్థితి చక్కబడింది. శనివారం ఆట ముగిసిన తర్వాత దీనిపై పైనీ మాట్లాడుతూ.. ‘ అసలు ఎందుకు రూట్‌-వేడ్‌లు సంయమనం కోల్పోయారు తెలీదు. ఎవరైనా అతిగా ప్రవర్తించడం సరైనది కాదు. ఇదొక టెస్టు మ్యాచ్‌.  నోరు జారడం ఎవరికీ మంచిది కాదు. క్రికెట్‌ ఆడటం కోసం వచ్చాం. దాని కోసమే మాట్లాడితే బాగుంటుంది తప్ప అనవరస రాద్ధాంతంతో విభేదాలు సృష్టించుకోవడం తగదు’ అని పైనీ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు