సుమారు రూ. 11 కోట్లు

19 Mar, 2019 00:28 IST|Sakshi

భారత్‌కు నష్టపరిహారం చెల్లించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు

కరాచీ: క్రికెట్‌ మైదానంలోనే కాదు... న్యాయపరమైన వ్యవహారాల్లో కూడా బీసీసీఐ చేతిలో పాక్‌ క్రికెట్‌ బోర్డుకు గట్టి దెబ్బ తప్పలేదు. ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత బోర్డు ఉల్లంఘించిందంటూ దావా వేసి ఇటీవలే ఓటమిపాలైన పీసీబీ ఇప్పుడు దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. న్యాయపరమైన ఖర్చులు, ఇతర నష్టం కలిపి పీసీబీ 1.6 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.11 కోట్లు) బీసీసీఐకి చెల్లించినట్లు పీసీబీ చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి వెల్లడించారు. ‘బీసీసీఐ చేతిలో ఓడిన నష్టపరిహారం కేసులో మేం 2.2 మిలియన్‌ డాలర్లు కోల్పోయాం. చివరకు ఐసీసీ భారత్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని 1.6 మిలియన్‌ డాలర్లుగా ఖరారు చేసింది’ అని మణి పేర్కొన్నారు. 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కనీసం ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే విధంగా బీసీసీఐ తమతో ఒప్పందం కుదుర్చుకుందని, అయితే దీనిని ఉల్లంఘించిన కారణంగా తమకు 70 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 490 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని పాక్‌ బోర్డు ఐసీసీ వివాద పరిష్కార కమిటీలో కేసు వేసింది. అయితే చివరకు ఎదురు డబ్బులు ఇచ్చుకోవాల్సి వచ్చింది!   

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ ఆగదు: ఐసీసీ
మరోవైపు భారత్, పాకిస్తాన్‌ మధ్య ప్రపంచ కప్‌లో జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌కు ఎలాంటి సమస్య రాదని ఐసీసీ సీఈఓ డేవ్‌ రిచర్డ్సన్‌ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే దీనిపై రిచర్డ్సన్‌ స్పష్టతనిచ్చారు. ‘ఐసీసీ టోర్నీలలో పాల్గొనడానికి సంబంధించి అన్ని సభ్య దేశాలతో జరిగిన ఒప్పందం ప్రకారం ఆయా జట్లు టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే ప్రత్యర్థి జట్టుకు పాయింట్లు ఇస్తాం. కాబట్టి మ్యాచ్‌ జరుగుతుందనే భావిస్తున్నా’ అని ఆయన చెప్పారు.    

మరిన్ని వార్తలు