పాక్‌-శ్రీలంక మ్యాచ్‌ వర్షార్పణం

7 Jun, 2019 20:51 IST|Sakshi

బ్రిస్టల్‌: వన్డే వరల్డ్‌కప్‌లో శుక్రవారం పాకిస్తాన్‌-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. వరుణుడు పదే పదే అంతరాయం కల్గించడంతో కనీసం టాస్‌ వేయడం కూడా సాధ్యం కాలేదు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం గం..3.00ని.లకు మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉండగా భారీ వర్షం కురిసింది. దాంతో పిచ్‌, ఔట్‌ ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ క్రమంలోనే చివరగా రాత్రి గం.8.30 ని.లకు పిచ్‌ను రిఫరీతో కలిసి పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పిచ్‌ చిత్తడిగా మారిపోవడంతో గ్రౌండ్స్‌మెన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు.

కనీసం 20 ఓవర్లు మ్యాచ్‌ను నిర్వహించాలని భావించినా అది కూడా సాధ్యం కాలేదు. దాంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ వర్షార్పణం అయ్యింది. ఇరు జట్లకు తలో పాయింట్‌ లభించింది. ఓవరాల్‌ వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంకకు పాయింట్‌ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకముందు ఇరు జట్లు ఏడుసార్లు వరల్డ్‌కప్‌లో తలపడగా అన్ని సందర్భాల్లోనూ పాక్‌నే విజయం వరించింది.

మరిన్ని వార్తలు