శ్రీలంకతో సిరీస్‌: కొత్త పెళ్లికొడుకు దూరం

21 Sep, 2019 17:13 IST|Sakshi

కరాచీ: స్వదేశంలో శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. చీఫ్‌ సెలక్టర్‌, హెడ్‌ కోచ్‌ మిస్బావుల్‌ హక్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శనివారం సుదీర్ఘ మంతనాలు జరిపిన అనంతరం జట్టులో పలు మార్పులు చేసింది. పాక్‌ జట్టులోకి ఐదుగురు కొత్త వాళ్లకి అవకాశం కల్పించింది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోని కొత్త పెళ్లికొడుకు, హరియాణా అల్లుడు హసన్‌ అలీని జట్టులోకి తీసుకోలేదు. హరియాణా యువతితో హసన్‌ అలీ వివాహం గత నెలలో దుబాయ్‌ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఇక హసన్‌ గాయం తీవ్రతపై స్పష్టత లేదని, అందుకే అతడికి విశ్రాంతినిచ్చామని మిస్బావుల్‌ తెలిపాడు. అంతేకాకుండా సీనియర్‌ ఆటగాడు మహ్మద్‌ హఫీజ్‌ను పక్కకు పెట్టారు. పేలవ ఫామ్‌తో విఫలమవుతున్న మహ్మద్‌ అమిర్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు.  

‘క్రికెట్‌లో గెలవడానికి సులువైన జట్లు, బలహీన ప్రత్యర్థులు ఉండరు. అనుభవం లేని ఆటగాళ్లు వచ్చినా.. సీనియర్‌ క్రికెటర్లు వచ్చినా మేము బలమైన జట్టును ఎంపిక చేయాలని భావించాం. (భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక సీనియర్‌ క్రికెటర్లు పాక్‌ పర్యటనకు ఆసక్తి చూపకపోవడంతో.. జూనియర్‌ ఆటగ్లాను పంపించాలనే ఆలోచనలో శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఉంది. ఈ నేపథ్యంలో మిస్బావుల్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.) ఐదుగురు కొత్త వాళ్లను ఎంపిక చేశాం. ఇందులో నలుగురు ఆటగాళ్లు ప్రపంచకప్‌కు ఆడాల్సిన వాళ్లే.. కానీ వారికి అవకాశం దక్కలేదు. అన్ని విభాగాల్లో పాక్‌ బలంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడితే పాక్‌దే విజయం’అంటూ మిస్బావుల్‌ పేర్కొన్నాడు. 

పాక్‌ జట్టు: సర్ఫరాజ్‌ అహ్మద్‌(కెప్టెన్‌), బాబర్‌ అజమ్‌(వైస్‌ కెప్టెన్‌), అబిద్‌ అలీ, ఆసిఫ్‌ ఆలీ, పఖర్‌ జామన్‌, హారీస్‌ సోహైల్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌, ఇమాద్‌ వసీమ్‌, ఇమాముల్‌ హక్‌, అమిర్‌, మహమ్మద్‌ హస్నైన్‌, నవాజ్‌, రియాజ్‌, షాదాబా ఖాన్‌, ఉస్మాన్‌ షిన్వారీ, వాహబ్‌ రియాజ్‌. 
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు