డబ్బులు ఇవ్వాలంటూ క్రికెటర్కు బెదిరింపులు

13 May, 2016 14:14 IST|Sakshi
డబ్బులు ఇవ్వాలంటూ క్రికెటర్కు బెదిరింపులు

కరాచీ: డబ్బు కోసం తనను గుర్తు తెలియని వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ పాకిస్తాన్ క్రికెటర్ షర్జీల్ ఖాన్ చెప్పాడు. తనకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేకుంటే తన నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించినట్టు తెలిపాడు. షర్జీల్ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించాడు.

'కొందరు గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. లేకుంటే నా భవిష్యత్కు భంగం కలిగించేలా వీడియోలను పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఎవరైనా అలాంటి వీడియోలను పోస్ట్ చేస్తే దయచేసి నమ్మకండి. అవన్నీ నకిలీ వీడియోలు. కొందరు నా ట్విట్టర్, ఫేస్బుక్ ఎకౌంట్లను కూడా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు' అని అభిమానులు, స్నేహితులను ఉద్దేశించి షర్జీల్ ట్వీట్ చేశాడు. బెదిరింపుల కేసులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పోలీసులు షర్జీల్కు అండగా నిలిచారు. ఆసియా కప్, ప్రపంచ టి-20 కప్లో పాక్కు షర్జీల్ ప్రాతినిధ్యం వహించాడు.

>
మరిన్ని వార్తలు