పాక్‌ అలవోకగా...

17 Sep, 2018 05:43 IST|Sakshi
ఉస్మాన్‌ ఖాన్, షాదాబ్‌ ఖాన్‌

హాంకాంగ్‌పై 8 వికెట్లతో ఘన విజయం

రాణించిన ఉస్మాన్, షాదాబ్‌

ఆసియా కప్‌ టోర్నమెంట్‌

ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ శుభారంభం చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పసికూన హాంకాంగ్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన మాజీ చాంపియన్‌ ఆపై ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. వన్డే హోదా లేని హాంకాంగ్‌ జట్టు ఏమాత్రం పోటీనివ్వకుండా తలవంచడంతో ఏకపక్షంగా మ్యాచ్‌ ముగిసింది. ముందుగా ఉస్మాన్‌ ఖాన్‌ బౌలింగ్‌తో మెరవగా, ఆ తర్వాత ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ అర్ధ సెంచరీతో మ్యాచ్‌ ముగించాడు.   

దుబాయ్‌: ఆరు దేశాల ఆసియా కప్‌ టోర్నీ రెండో లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ సునాయాస విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 8 వికెట్ల తేడాతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్‌ 37.1 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. లెఫ్టార్మ్‌ పేసర్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఉస్మాన్‌ ఖాన్‌ (3/19) ప్రత్యర్థిని పడగొట్టగా... హసన్‌ అలీ, షాదాబ్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం పాక్‌ 23.3 ఓవర్లలో 2 వికెట్లకు 120 పరుగులు చేసింది. ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (69 బంతుల్లో 50 నాటౌట్‌: 3 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. నేడు అబుదాబిలో జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో అఫ్గానిస్తాన్‌ తలపడుతుంది.  

టపటపా...
పదేళ్ల తర్వాత ఆసియా కప్‌ బరిలోకి దిగిన హాంకాంగ్‌ జట్టు తమ ఆటతీరుతో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టు పాకిస్తాన్‌ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆరో వికెట్‌కు ఎజాజ్‌ ఖాన్‌ (47 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌), కించిత్‌ షా (50 బంతుల్లో 26; 1 ఫోర్‌) 13.5 ఓవర్లలో జోడించిన 53 పరుగులు మినహా జట్టు ఇన్నింగ్స్‌ పేలవంగా సాగింది. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ సున్నాకే వెనుదిరిగారు. ఆమిర్‌ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన నిజాకత్‌ (13) అనూహ్యంగా రనౌట్‌ కాగా, కెప్టెన్‌ అన్షుమన్‌ రథ్‌ (19) ఎక్కువ సేపు నిలవలేదు.

ఆ తర్వాత ఐదు పరుగుల వ్యవధిలో కార్టర్‌ (2), బాబర్‌ (7), ఎహ్‌సాన్‌ ఖాన్‌ (0) వెనుదిరిగారు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో షాదాబ్‌ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. ఈ దశలో ఎజాజ్‌ ఖాన్, కించిత్‌ షా కలిసి కొద్ది సేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఎజాజ్‌ను చక్కటి బంతితో ఉస్మాన్‌ బౌల్డ్‌ చేసిన తర్వాత మరో 19 పరుగులు జోడించి హాంకాంగ్‌ మిగిలిన నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఉస్మాన్‌ వేసిన 31వ ఓవర్లోనే హాంకాంగ్‌ మూడు వికెట్లు కోల్పోవడం విశేషం.  

ఆడుతూ పాడుతూ...
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో పాక్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. ఓపెనర్లు ఇమామ్, ఫఖర్‌ జమాన్‌ (24) తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత బాబర్‌ ఆజమ్‌ (33; 3 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి ఇమామ్‌ జట్టును నడిపించారు. ఈ క్రమంలో ఆజమ్‌ తన కెరీర్‌లో 2 వేల పరుగుల మైలురాయి అందు కున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 52 పరుగులు జత చేశారు. అంపైర్‌ తప్పుడు నిర్ణయాలతో రెండు సార్లు ఔట్‌ కాకుండా తప్పించుకున్న ఇమామ్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, షోయబ్‌ మాలిక్‌ (9 నాటౌట్‌) బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు.  

స్కోరు వివరాలు
హాంకాంగ్‌ ఇన్నింగ్స్‌: నిజాకత్‌ ఖాన్‌ (రనౌట్‌) 13; అన్షుమన్‌ రథ్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) ఫహీమ్‌ 19; బాబర్‌ హయత్‌ (స్టంప్డ్‌) సర్ఫరాజ్‌ (బి) షాదాబ్‌ 7; కార్టర్‌ (సి) ఇమామ్‌ (బి) హసన్‌  అలీ 2; కించిత్‌ షా (సి) షాదాబ్‌ (బి) హసన్‌ అలీ 26; ఎహ్‌సాన్‌ ఖాన్‌ (ఎల్బీ) (బి) షాదాబ్‌ 0; ఎజాజ్‌ ఖాన్‌ (బి) ఉస్మాన్‌  27; స్కాట్‌ మెక్‌కెచ్‌నీ (ఎల్బీ) (బి) ఉస్మాన్‌ 0; తన్వీర్‌ (బి) ఉస్మాన్‌ 0; ఎహ్‌సాన్‌ నవాజ్‌ (రనౌట్‌) 9; నదీమ్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (37.1 ఓవర్లలో ఆలౌట్‌) 116.  

వికెట్ల పతనం: 1–17; 2–32; 3–39; 4–44; 5–44; 6–97; 7–97; 8–97; 9–99; 10–116.

బౌలింగ్‌: ఆమిర్‌ 7–1–20–0; ఉస్మాన్‌ ఖాన్‌ 7.3–1–19–3; ఫహీమ్‌ అష్రఫ్‌ 4–0–10–1; హసన్‌ అలీ 7.1–0–19–2; షాదాబ్‌ 8–1–31–2; షోయబ్‌ మాలిక్‌ 3–0–17–0; ఫఖర్‌ జమాన్‌ 0.3–0–0–0.  

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (నాటౌట్‌) 50; ఫఖర్‌ జమాన్‌ (సి) మెక్‌కెచ్‌నీ (బి) ఎహ్‌సాన్‌ ఖాన్‌ 24; బాబర్‌ ఆజమ్‌ (సి) మెక్‌కెచ్‌నీ (బి) ఎహ్‌సాన్‌ ఖాన్‌ 33; షోయబ్‌ మాలిక్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (23.4 ఓవర్లలో 2 వికెట్లకు) 120.  

వికెట్ల పతనం: 1–41, 2–93. బౌలింగ్‌: అఫ్జల్‌ 4–2–13–0; నవాజ్‌ 4–0–27–0; ఎజాజ్‌ ఖాన్‌ 3.4–0–19–0; ఎహ్‌సాన్‌ ఖాన్‌ 8–0–34–2; నదీమ్‌ అహ్మద్‌ 4–0–27–0.  

మరిన్ని వార్తలు