మరో వైట్వాష్ తప్పదా?

3 Oct, 2016 11:54 IST|Sakshi
మరో వైట్వాష్ తప్పదా?

షార్జా: గత కొన్ని నెలల క్రితం భారత్లో జరిగిన టీ 20 ప్రపంచకప్లో వెస్టిండీస్ చాంపియన్ గా నిలిచింది. అయితే అప్పటితో పోల్చి చూస్తే ప్రస్తుతం విండీస్ జట్టు ఘోరంగా విఫలమవుతోంది. పలువురు ప్రధాన ఆటగాళ్లపై వేటు ఒక కారణమైతే, మరికొంతమంది గైర్హాజరీ ఆ జట్టు భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చేసింది. యూఏఈలో పాకిస్తాన్ తో జరుగుతున్న దైపాక్షిక సిరీసే ఇందుకు ఉదాహరణ.

ఇరు జట్ల సుదీర్ఘ సిరీస్ లో విండీస్ అత్యంత పేలవంగా ఆడుతోంది.  పాకిస్తాన్ తో జరిగిన మూడు టీ 20 ల సిరీస్లో వైట్ వాష్ అయిన వెస్టిండీస్.. మూడు వన్డేల సిరీస్ లో కూడా అదే ఆట తీరును కనబరుస్తోంది. జాసన్ హోల్డర్ నాయకత్వంలో పాక్ తో సిరీస్లు ఆడుతున్న విండీస్ ఇప్పటివరకూ ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. తాజాగా ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో విండీస్ 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డారెన్ బ్రేవో, మార్లోన్ శ్యామ్యూల్స్ లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.

టాస్ గెలిచిన పాకిసాన్ తొలుత బ్యాటింగ్ తీసుకుని 337 పరుగులు చేసింది. ఆ జట్టులో బాబర్ అజామ్(123) సెంచరీ సాధించడంతో పాటు, షోయబ్ మాలిక్ (90), సర్ఫరాజ్ అహ్మద్(60)లు రాణించడంతో పాక్ భారీ స్కోరు నమోదు చేసింది. అయితే అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 278 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దీంతో వన్డే సిరీస్ ను కూడా చేజార్చుకున్న విండీస్  మరో వైట్ వాష్ దిశగా కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే బుధవారం జరుగనుంది. ఆ మ్యాచ్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న విండీస్ ఎంతవరకు రాణిస్తుందో?

>
మరిన్ని వార్తలు