పాకిస్తాన్‌ పేకమేడలా..

31 May, 2019 17:02 IST|Sakshi

నాటింగ్‌హామ్‌: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు అంటేనే నిలకడలేమికి మారుపేరు. ఆ జట్టులో స్టార్‌ క్రికెటర్లు ఉన్నా అది కాగితాలకే పరిమితం అవుతుందనే విషయం మరోసారి రుజువైంది. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 105 పరుగులకే కుప్పకూలింది. ఏ దశలోనే విండీస్‌ పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కోలేక మూడంకెల స్కోరును దాటడానికి అష్టకష్టాలు పడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌(2) ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరాడు. దాంతో 17 పరుగులకే పాకిస్తాన్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
పాకిస్తాన్‌ 105 పరుగులకే ఆలౌట్‌​​​​​​​


ఆపై పాక్‌ టాపార్డర్‌ ఆటగాళ్లలో ఫకార్‌ జమాన్‌(22), హరీస్‌ సోహైల్‌(8), బాబర్‌ అజమ్‌(22), సర్పరాజ్‌ అహ్మద్‌(8)లు సైతం నిరాశపరిచారు. విండీస్‌ బౌలర్ల నుంచి వచ్చే పదునైన బంతులకు పాక్‌ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆటు తర్వాత వచ్చిన ఆటగాళ్లలో వహబ్‌ రియాజ్‌(18; 11 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో పాకిస్తాన్‌ వంద పరుగుల మార్కును అతికష్టం మీద చేరింది.  చివరి వికెట్‌గా రియాజ్‌ ఔట్‌ కావడంతో పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ 21. 4 ఓవర్లలోనే ముగిసింది. విండీస్‌ బౌలర్లలో థామస్‌ నాలుగు వికెట్లతో సత్తాచాటగా, జేసన్ హోల్డర్‌ మూడు వికెట్లతో పాక్‌ వెన్నువిరిచాడు.  ఇక ఆండ్రీ రసెల్‌ రెండు వికెట్లు తీయగా, కాట్రెల్‌కు వికెట్‌ లభించింది.

>
మరిన్ని వార్తలు