విండీస్‌ను ఆపగలదా పాక్‌!

31 May, 2019 04:47 IST|Sakshi
హోల్డర్‌, సర్ఫరాజ్‌

నేడు మాజీ చాంపియన్ల మధ్య మ్యాచ్‌

మ.3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

నాటింగ్‌హామ్‌: తమదైన రోజున అద్భుత ప్రదర్శన చేయగల విండీస్‌–పాక్‌ మధ్య మ్యాచ్‌ అంటే అభిమానులకు ఎంతో కొంత మజా దక్కడం ఖాయం. ‘యూనివర్సల్‌ బాస్‌’ క్రిస్‌ గేల్, విధ్వంసక ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ పునరాగమనంతో పుంజుకొన్న వెస్టిండీస్‌ను ఎదుర్కొనడం... ఇటీవలి కాలంలో వన్డే ఫామ్‌ తీసికట్టుగా ఉన్న పాకిస్తాన్‌కు సవాల్‌తో కూడుకున్నదే. అయితే, రెండేళ్ల క్రితం ఇక్కడే చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచిన సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని పాక్‌ భావిస్తోంది. ఈ క్రమంలో టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఫఖర్‌ జమాన్, ఇమాముల్‌ హక్, బాబర్‌ ఆజమ్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. వీరు రాణించి భారీ స్కోరు అందిస్తే... పేసర్లు ఆమిర్, షాహీన్‌ ఆఫ్రిది మిగతా బాధ్యత చూసుకుంటారని భావిస్తోంది.

విండీస్‌ వీరులు ఎలా ఆడతారో?
గతాని కంటే భిన్నంగా ఉన్న వెస్టిండీస్‌ ఈసారి కప్‌లో మెరుగైన ఫలితాలు సాధించేలా కనిపిస్తోంది. జేసన్‌ హోల్డర్‌ నేతృత్వంలో మెరుగ్గా రాణిస్తోంది. నాలుగు నెలల క్రితం సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను వన్డేల్లో నిలువరించింది. నిలకడగా ఆడే షై హోప్, దూకుడుగా బాదే హెట్‌మైర్‌ జట్టుకు మరింత బలాన్ని చేకూర్చారు. గేల్‌కు తోడుగా ఇన్నింగ్స్‌ ప్రారంభించే ఎవిన్‌ లూయిస్‌ సైతం భారీ షాట్లతో హడలెత్తించగలడు. మిడిలార్డర్‌లో డారెన్‌ బ్రావో ఫామ్‌ అందుకోవాల్సి ఉంది. రోచ్, కాట్రెల్‌ ప్రధాన పేసర్లు కాగా... ఒషేన్‌ థామస్, గాబ్రియెల్‌లో ఒకరికే అవకాశం దక్కనుంది. పేస్‌ ఆల్‌రౌండర్లు హోల్డర్, రసెల్‌ పాత్ర కీలకం కానుంది. ఏకైక స్పిన్నర్‌గా ఆష్లే నర్స్‌ ఆడనున్నాడు. బ్యాటింగ్‌లో చెలరేగితేనే విండీస్‌కు విజయావకాశాలు ఉంటాయి.

పరాజయ పరంపరకు అడ్డుపడుతుందా?
ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సహా గత 10 వన్డేల్లో పాక్‌ ఓటమి పాలైంది. దీన్నిబట్టే ఆ జట్టు పరిస్థితి తెలుస్తోంది. ఈ పరంపరకు విండీస్‌పై విజయంతో అడ్డువేయాలని భావిస్తోంది. మిడిలార్డర్‌ నుంచి మెరుగైన ప్రదర్శన లేకపోవడం ఒక కారణమైతే, బౌలింగ్‌లో పదును తగ్గడం మరో కారణం. ఓపెనర్లు ఇమాముల్‌ హక్, ఫఖర్‌ జమాన్, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ ఫామ్‌తోనే జట్టు కాస్తయినా నిలవగలుగుతోంది. హారిస్‌ సొహైల్, మొహమ్మద్‌ హఫీజ్‌లలో చోటు దక్కినవారు నాలుగో స్థానంలో దిగుతారు. ఐదో స్థానంలో వచ్చే సర్ఫరాజ్‌ ఔటైతే స్కోరును నడిపించేవారు లేకపోవడం ఇబ్బందికరం. ఆమిర్, హసన్‌ అలీ, ఆఫ్రిది పేస్‌ త్రయం చేసే మ్యాజిక్‌ పాక్‌ గెలుపునకు కారణం కాగలదు.

ముఖాముఖి రికార్డు
రెండు జట్లు మొత్తం 133 వన్డేల్లో తలపడ్డాయి. 70 మ్యాచ్‌ల్లో విండీస్, 60 మ్యాచ్‌ల్లో పాక్‌ గెలిచాయి. మూడు మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్లు పది మ్యాచ్‌ల్లో ఎదురుపడగా విండీస్‌ ఏడింటిలో నెగ్గింది. పాకిస్తాన్‌కు మూడింటిలో విజయం దక్కింది. ఇంగ్లండ్‌ వేదికగా ఈ రెండు జట్లు ఆరుసార్లు ‘ఢీ’కొన్నాయి. ఒక మ్యాచ్‌లో పాక్‌ నెగ్గగా... ఐదింటిలో విండీస్‌ గెలిచింది.   

అటు పటిష్టమైన జట్లుగానూ చెప్పలేని...  అంతమాత్రాన బలహీనమైనవిగానూ పరిగణించలేని పాకిస్తాన్, వెస్టిండీస్‌ శుక్రవారం ప్రపంచ కప్‌లో తలపడనున్నాయి. నిలకడ లేని, అనూహ్య ఆటతీరుకు ఈ రెండు జట్లు పెట్టింది పేరు. భారీ హిట్టర్లతో కూడిన విండీస్‌ను ఎంతమేరకు నిలువరిస్తుందనే దానిపైనే పాక్‌ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇదే సమయంలో ఆమిర్‌ వంటి నాణ్యమైన పేసర్లు చెలరేగితే కరీబియన్లకు ముకుతాడు పడినట్లే.  
 

మరిన్ని వార్తలు