‘ఈ ఏడాది చాలా కష్టంగా గడిచింది’

31 Dec, 2019 18:46 IST|Sakshi

ఇస్లామాబాద్‌: రెండు టెస్టు సిరీసుల్లో (ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా) ఓటమి చవిచూడటం, రన్‌రేట్‌ కారణంగా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు చేరకపోవడం వంటి ఘటనలతో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు ఈ ఏడాది(2019) చాలా కష్టంగా గడిచిందని ఆ జట్టు కోచ్‌ మిస్బావుల్‌ హక్‌ పేర్కొన్నాడు.  ముఖ్యంగా టెస్టుల్లో తమ జట్టు ఆశించిన మేర రాణించలేదని అసహనం వ్యక్తం చేశాడు. అయితే దాదాపు దశాబ్దం తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్‌ జరగడం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. అంతేకాకుండా శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో పాక్‌ కైవసం చేసుకోవడం ఈ ఏడాది తమ జట్టుకు మరో హైలెట్‌గా నిలిచిందన్నాడు. అయితే అదే జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో చిత్తుచిత్తుగా ఓడిపోవడం కూడా బాధించిందన్నాడు. 

అయితే ఓవరాల్‌గా పొట్టి క్రికెట్‌లో పాక్‌ ప్రదర్శనపై సంతృప్తికరంగా ఉన్నామని.. అయితే రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో ప్రదర్శనపైనే తాము ఆందోళనగా ఉన్నామని మిస్బావుల్‌ అన్నాడు. టెస్టు ఫార్మట్‌పై తాము ఇంకాస్త దృష్టి పెట్టాలన్నాడు. అయితే స్వదేశంలో టెస్టులు ఆడితే ఏ జట్టుకైనా అదనపు బలం కలుగుతుందని అభిప్రాయపడ్డాడు. గత కొన్నేళ్లుగా పాక్‌లో టెస్టులు లేకపోవడం వలన జట్టులో స్థైర్యం దెబ్బతిందన్నాడు. కనీసం రానున్న ఏడాదిలోనైనా పాక్‌లో ఎక్కువ టెస్టులు ఆడగలిగితే తమ జట్టుకు ఎంతో లాభం చేకూరుతుందన్నాడు. 

ఇక ఈ ఏడాది ఆటగాళ్ల ప్రదర్శనపై మిస్బావుల్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బాబర్‌ అజమ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఫార్మట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించాడని, పాక్‌ జట్టుకు అతడే స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అని కితాబిచ్చాడు. ఇక అతడితో పాటు కర్రాళ్లు నసీమ్‌ షా, షాహీన్‌ ఆఫ్రిదిల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. అంతేకాకుండా పాక్‌ భవిష్యత్‌ క్రికెటర్లు వీరేనంటూ వ్యాఖ్యానించాడు. ఇక ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం టీ20 ప్రపంచకప్‌ అని ఈ మెగా టోర్నీ కోసం సన్నద్దమవుతున్నట్లు మిస్బావుల్‌ తెలిపాడు. 2017 చాంపియన్‌ ట్రోఫీ తర్వాత పాక్‌ చెప్పుకునేంత పెద్ద టోర్నీలు గెలవలేదని.. అందుకే ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్లు పేర్కొన్నాడు.    

మరిన్ని వార్తలు