సర్ఫరాజ్‌... ఇమ్రాన్‌ కాగలడా!

27 May, 2019 03:49 IST|Sakshi

రెండో టైటిల్‌ వేటలో పాకిస్తాన్‌

అనూహ్య ప్రదర్శనకు అవకాశం

నిలకడలేమి సమస్య

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే ఇంగ్లండ్‌ గడ్డపై చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచిన తర్వాత పాకిస్తాన్‌ జట్టు 38 వన్డేలు ఆడితే 15 గెలిచింది. ఇందులో జింబాబ్వే, హాంకాంగ్, అఫ్గానిస్తాన్, బలహీన శ్రీలంకలపైనే 12 వచ్చాయి. అదే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలాంటి పెద్ద జట్లతో తలపడినప్పుడు 23 మ్యాచ్‌లలో ఓడిపోయి 3 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. వరుసగా 11 వన్డేల్లో పరాజయం తర్వాత ఇప్పుడు పాక్‌ ప్రపంచ కప్‌ బరిలోకి దిగుతోంది. మొదటి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ చేతిలో కూడా చావుదెబ్బ తింది.

ఈ గణాంకాలు చూస్తే ఏ జట్టయినా పాకిస్తాన్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి! కానీ అలా ఎవరైనా భావిస్తే అది స్వయంకృతాపరాధమే అవుతుంది. ఎందుకంటే విజయపు అంచుల నుంచి ఓటమి వైపు వెళ్లినా... ఒక శాతం కూడా విజయావకాశం లేని చోట అనూహ్యంగా ఎగసి విజేతగా నిలవడం పాకిస్తాన్‌కే చెల్లు. 1992 టోర్నీ సహా ఇది గతంలో ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇప్పుడు కూడా వరల్డ్‌ కప్‌లో ఆ జట్టు మరోసారి అలాంటి సంచలనాన్నే ఆశిస్తోంది. కాబట్టి ప్రతీ జట్టు జాగ్రత్త పడాల్సిందే. 1992 తరహా ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో తామే గెలుస్తామని భావిస్తున్న అభిమానుల కోరిక నెరవేరుతుందా! తీవ్ర పోటీ ఉన్న ప్రపంచ కప్‌ పోరులో పాక్‌ నిలిచేదెక్కడ?

బలాలు
గతంలో ఎప్పుడు పాకిస్తాన్‌ గురించి ప్రస్తావించినా ఆ జట్టు బౌలింగ్‌ బలంపైనే ఎక్కువగా చర్చ జరిగేది. అయితే ఇటీవల  టీమ్‌ బ్యాటింగ్‌ కూడా ఎంతో మెరుగుపడింది. ముఖ్యంగా టాప్‌–3పైనే టీమ్‌ ఆశలు పెట్టుకుంది. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన ఏకైక పాకిస్తాన్‌ ఆటగాడైన ఫఖర్‌ జమాన్, సుమారు 60 సగటుతో నిలకడగా రాణిస్తున్న ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ ఓపెనర్లుగా జట్టుకు కీలకం కానున్నారు. మూడో స్థానంలో ఇప్పటికే ‘పాక్‌ కోహ్లి’గా ప్రశంసలు అందుకుంటున్న బాబర్‌ ఆజమ్‌ రికార్డు అద్భుతంగా ఉంది. మిడిలార్డర్‌లో అనుభవజ్ఞులైన హఫీజ్, షోయబ్‌ మాలిక్‌ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొని ఇన్నింగ్స్‌ను నడిపించగలరు.

హారీస్‌ సొహైల్‌ మరో కీలక ఆటగాడు కాగా ఆసిఫ్‌ అలీకి మంచి హిట్టింగ్‌ సామర్థ్యం ఉంది. బౌలింగ్‌లో ‘చాంపియన్స్‌ ట్రోఫీ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ హసన్‌ అలీతో పాటు మొహమ్మద్‌ ఆమిర్‌ను జట్టు నమ్ముకుంది. లెగ్‌ స్పిన్నర్‌ షాదాబ్‌ ఖాన్‌పై పాక్‌ ఆశలు పెట్టుకోగా... కుర్ర పేసర్లు షాహిన్‌ ఆఫ్రిది, హస్నయిన్‌ సంచలనాలు చేయగలరని జట్టు ఆశిస్తోంది. మ్యాచ్‌లు ఓడినా ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వరుస వన్డేల్లో 358, 340 పరుగులు చేయడం జట్టు బ్యాటింగ్‌ బృందంలో ఆత్మవిశ్వాసం పెంచింది.

బలహీనతలు
పాక్‌కు కవచకుండలాల్లాంటి బలహీనతలు నిలకడలేమి, ఘోరమైన ఫీల్డింగ్, ఒత్తిడిలో అనూహ్యంగా కుప్పకూలిపోయే లక్షణం ఒక్కసారిగా జట్టును బలహీనంగా మారుస్తున్నాయి. ఈతరం వన్డే క్రికెట్‌లో సాధారణంగా మారిపోయిన ‘పవర్‌ హిట్టింగ్‌’ పాక్‌ టీమ్‌లో అస్సలు కనిపించడం లేదు. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ నుంచే తీసుకుంటే ఈ ప్రపంచ కప్‌లో పోటీ పడుతున్న జట్లలో (బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ మినహా) బౌండరీల రూపంలో అతి తక్కు వ పరుగులు (8.33 శాతం) చేసిన జట్టు పాకిస్తాన్‌. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌ వైఫల్యం తరచూ జట్టును దెబ్బ తీస్తోంది. రెండు దశాబ్దాల కెరీర్‌ ఉన్న షోయబ్‌ మాలిక్‌ కూడా ఇటీవల కీలక సమయాల్లో చాలా సార్లు చేతులెత్తేశాడు.

ఈసారి అనూహ్యంగా పేస్‌ బౌలర్ల ఎంపిక వివాదాస్పదంగా మారి జట్టును గందరగోళంలో పడేసింది. జునైద్‌ ఖాన్‌ను తీసేసి రెండేళ్ల క్రితం చివరి వన్డే ఆడిన, ఇంగ్లండ్‌లో ఘోరమైన రికార్డు ఉన్న వహాబ్‌ రియాజ్‌ను ఎంపిక చేయడం, సుదీర్ఘ కాలంగా విఫలమవుతున్నా ఆమిర్‌పైనే నమ్మకముంచడం తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఆఫ్రిది, హస్నయిన్‌ మెరుగ్గానే కనిపిస్తున్నా... వరల్డ్‌ కప్‌లాంటి మెగా టోర్నీలో వారి అనుభవలేమి సమస్యగా మారవచ్చు. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి పాక్‌ బౌలింగ్‌ బలహీనంగానే కనిపిస్తోంది. పైగా హసన్‌ అలీ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. దాదాపు 350 పరుగుల స్కోరు కూడా నిలబెట్టుకోకపోతుండటం దీనిని మరోసారి రుజువు చేసింది.  

గత రికార్డు...
ప్రతిష్టాత్మక కప్‌ను గెలుచుకున్న జట్లలో పాకిస్తాన్‌ కూడా ఒకటి. 1992లో ఇమ్రాన్‌ సారథ్యంలో పాక్‌ విశ్వవిజేతగా నిలిచింది. 1999లో ఫైనల్‌ కూడా చేరింది. మరో నాలుగు సందర్భాల్లో (1979, 1983, 1987, 2011)లలో సెమీఫైనల్‌ చేరిన రికార్డు ఉంది. గత ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో క్వార్టర్‌ ఫైనల్లో ఓడి వెనుదిరిగింది.  

మరిన్ని వార్తలు