భారత్ లో పర్యటనపై తొందరపడకండి!

6 Mar, 2016 18:25 IST|Sakshi
భారత్ లో పర్యటనపై తొందరపడకండి!

కరాచీ: భారత్ లో జరిగే వరల్డ్ ట్వంటీ 20లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాల్గొనడంపై నెలకొన్న అనిశ్చిత ఇంకా వీడలేదు. దీనిలో భాగంగానే భారత్ కు పయనం కానున్న పాక్ మహిళా జట్టును వెళ్లొద్దంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆదేశాలు జారీ చేసింది. భారత్ నుంచి భద్రతపరంగా రాతపూర్వకంగా ఎటువంటి హామీ రానందున పర్యటనపై తొందరపడాల్సిన పనిలేదని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ సూచించారు.

 

పురుషుల, మహిళల వరల్డ్ టీ 20 టోర్నీలు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టు మంగళవారం మధ్యాహ్నం భారత్ కు రావాల్సి ఉంది. కాగా, భారత్ లో పాక్ జట్టు భద్రతకు సంబంధించి ఇంకా ఎటువంటి హామీ రానందున మరికొన్ని రోజులు వేచి చూచే ధోరణే మంచిదిగా పీసీబీ భావిస్తోంది.. ' మా క్రికెట్ జట్టు భద్రతపై భారత్ నుంచి లిఖిత పూర్వక హామీ రాలేదు.  ఇంకా పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు వీసాల కోసం ఎదురుచూస్తున్నాం. భద్రతపరంగా మాకు సరైన నమ్మకం ఏర్పడకపోతే పాక్ జట్టును పంపడం కష్టమే. ఆ క్రమంలో పర్యటనను పాక్షింకగా వాయిదా వేశాం'  అని షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు గత గురువారమే భారత్ బయల్దేరాల్సి ఉన్నా భద్రతా పరమైన కారణాలతో ఆ జట్టు కూడా తమ పర్యటనను వాయిదా వేసింది.  దాంతో వరల్డ్ టీ 20 లో పాక్ జట్లు పాల్గొనే అంశం మరింత సందిగ్థంలో పడింది.

మరిన్ని వార్తలు