‘సెంచరీ పూర్తికాకుండా కుట్ర చేశారు!’

2 Oct, 2019 14:20 IST|Sakshi

కరాచీ: పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు.. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఓ అవమానకరమైన సంఘటను ఎదుర్కొంది. కరాచీ వేదికగా పాక్‌-శ్రీలంక మధ్య మంగళవారం రాత్రి రెండో వన్డే జరిగిన విషయం తెలిసిందే. పదేళ్ల తరువాత పాక్‌ గడ్డపై మ్యాచ్‌ ఆడుతుండటం విశేషం. అయితే శ్రీలంక బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పలుమార్లు ఫ్లడ్‌లైట్లు మొరాయించాయి. దీంతో పలుమార్లు ఆటకు తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. అయితే దీనిపై సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. కరెంట్‌ బిల్లు కట్టకపోవడంతో స్టేడియంలో పవర్‌ కట్‌ అయ్యిందంటూ నెటిజన్లు నవ్వులు పూయిస్తున్నారు.

సిటి ఆఫ్‌ లైట్స్‌గా పేరొందిన కరాచీలో కూడా విద్యుత్‌ సమస్య ఉందంటూ మరికొంత మంది సెటైర్‌ వేశారు. లంక ఆటగాడు షేహాన్‌ జయసూర్య సరిగ్గా 96 పరుగుల వద్ద అవుట్‌ కావడంతో.. ఫ్లడ్‌లైట్ల కుట్ర కారణంగానే అతను తొలి సెంచరీ కోల్పోయాడని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. కాగా ఈ పరిణామం లంక ఆటగాళ్లని తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది. 2009లో ఆటగాళ్లపై దాడి అనంతరం తొలిసారి వన్డే సిరీస్‌ జరుగుతుండంతో పాక్‌ దీనిని ఎంతో ‍ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వర్షం కారణంగా తొలి వన్డే రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో పాక్‌ విజయం సాధించింది.

మరిన్ని వార్తలు