భారత యువతిని పెళ్లాడనున్న పాక్‌ క్రికెటర్‌ 

31 Jul, 2019 01:51 IST|Sakshi

కరాచీ : మరో పాకిస్తాన్‌ క్రికెటర్‌ భారత్‌కు అల్లుడవుతున్నాడు. పేస్‌ బౌలర్‌ హసన్‌ అలీ హరియాణాకు చెందిన షమీమా అర్జూను వివాహమాడనున్నాడు. వచ్చేనెల 20న దుబాయ్‌లోని హోటల్‌లో ఈ నిఖా తంతు జరుగుతుందని క్రికెటర్‌ సన్నిహితులు వెల్లడించారు. హరియాణా అమ్మాయి అయిన షమీమా దుబాయ్‌లో స్థిరపడింది. భారత్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఆమె ఉన్నత చదువు కోసం ఇంగ్లండ్‌ వెళ్లింది. అనంతరం ఫ్లైట్‌ ఇంజనీర్‌గా ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తోంది. కొన్నాళ్ల క్రితం దుబాయ్‌లో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ఇప్పుడు పరిణయం దాకా వచ్చింది.

పెళ్లి సంగతి నిజమే కానీ తేదీ మాత్రం ఖరారు కాలేదని హసన్‌ అలీ చెప్పాడు. మరోవైపు పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని దుబాయ్‌లోని అట్లాంటిస్‌ పామ్‌ హోటల్‌లో వేడుక జరుగనుందని సన్నిహితులు పేర్కొన్నారు. ఇదే జరిగితే భారత యువతిని పెళ్లి చేసుకుంటున్న నాలుగో పాక్‌ క్రికెటర్‌ హసన్‌ అలీ. ఇదివరకు జహీర్‌ అబ్బాస్, మోసిన్‌ ఖాన్, షోయబ్‌ మాలిక్‌లు భారత వధువుల్ని వివాహమాడారు. షోయబ్‌ హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను పెళ్లాడగా వీరికి ఓ కొడుకు (ఇహాన్‌ మీర్జా మాలిక్‌) పుట్టాడు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు