స్పాట్ ఫిక్సింగ్: పాకిస్థాన్ క్రికెటర్‌పై వేటు

14 Mar, 2017 15:37 IST|Sakshi
స్పాట్ ఫిక్సింగ్: పాకిస్థాన్ క్రికెటర్‌పై వేటు

కరాచీ: వివాదాలకు, అనిశ్చితికి పాకిస్థాన్ క్రికెట్ మారుపేరు. ఎప్పుడు ఎవరు జట్టులో ఉంటారో, కెప్టెన్‌గా ఎవరు ఉంటారో, ఎప్పుడెలా ఆడుతారో ఊహించడం కష్టం. దీనికి తోడు పాకిస్థాన్ క్రికెటర్లపై అవినీతి ఆరోపణలు షరా మామూలే. తాజాగా స్పాట్ ఫిక్సింగ్ కేసులో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్‌పై వేటు వేశారు. ఇర్ఫాన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత పొడగరి అయిన ఫాస్ట్ బౌలర్‌గా ఇర్ఫాన్‌కు గుర్తింపు ఉంది. పాక్ తరఫున నాలుగు టెస్టులు, 60 వన్డేలు, 20 టి-20 మ్యాచ్‌లు ఆడాడు.

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇర్పాన్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓ బుకీ అతన్ని సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పీసీబీ విచారణకు ఆదేశించింది. సోమవారం పీసీబీ అవినీతి నిరోధక కమిటీ ముందు ఇర్ఫాన్ హాజరైనా సమాధానం ఇవ్వలేదు. అతని కుటుంబ సభ్యులు మరణించడంతో బాధలో ఉన్నట్టు సమాచారం. బుకీలతో సంబంధాలు, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి అతనిపై పీసీబీ ఛార్జిషీట్ నమోదు చేసి, సస్పెండ్ చేసింది. 14 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.  

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలపై మరో ఇద్దరు క్రికెటర్లు షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్‌ సస్పెండ్ అయ్యారు. దీనిపై పీసీబీ విచారణకు ఆదేశించింది. ఫిక్సింగ్ కేసులోనే మరో పాక్ క్రికెటర్ నసీర్ జంషెడ్‌ అరెస్టయ్యాడు. గతంలో పాక్ అంతర్జాతీయ క్రికెటర్లు మహ్మద్ ఆమీర్, సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్‌లు ఫిక్సింగ్ కేసులో సస్పెండ్ కావడంతో పాటు జైలు శిక్ష అనుభవించారు. గతంలో ఇంకా పలువురు పాక్ క్రికెటర్లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.

>
మరిన్ని వార్తలు