పాక్‌ క్రికెటర్‌కు 17నెలల జైలుశిక్ష

8 Feb, 2020 21:50 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్ మాజీ ఓపెనర్ నాసిర్ జంషెడ్‌కు 17 నెల‌ల జైలు శిక్ష ఖ‌రారైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో తోటి క్రికెటర్లకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కారణంగా జెంషెడ్‌కు శిక్ష పడింది. గత డిసెంబర్‌లో 33 ఏళ్ల నాసిర్ జంషెడ్ తన నేరాన్ని అంగీకరించగా.. మాంచెస్టర్ క్రౌన్ కోర్టు శుక్రవారం 17 నెలల జైలు శిక్షను విధించింది. పాక్ సూప‌ర్ లీగ్‌లో ప్లేయ‌ర్లుగా ఉన్న యూసెఫ్ అన్వర్‌, మొహ‌మ్మద​ ఇజాజ్‌లు లీగ్‌లో స‌రైన ప్రదర్శన ఇవ్వ‌కుండా ఉండేందుకు జెంషెడ్‌ వారికి ముడుపులు ఇవ్వ‌చూపిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గత డిసెంబర్ నెలలో నేష‌న‌ల్ క్రైం ఏజెన్సీ ఈ ఫిక్సింగ్‌ను బట్టబయలు చేసింది.

నేష‌న‌ల్ క్రైం ఏజెన్సీ విచారణలో త‌మ నేరాల‌నునాసిర్ జంషెడ్, అన్వ‌ర్‌, ఇజాజ్‌లు అంగీక‌రించారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో కోర్టు ఈ ముగ్గురికి శిక్ష‌ను విధించింది. జెంషెడ్‌కు 17 నెల‌ల జైలు శిక్ష పడగా.. అన్వ‌ర్‌కు 40 నెల‌లు, ఇజాజ్‌కు 30 నెల‌ల శిక్ష ప‌డింది. 2018 ఆగ‌స్టులోనే పాక్ క్రికెట్ బోర్డు జెంషెడ్‌పై ప‌దేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2016-17 సీజన్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నసీర్‌కు పీసీబీ పదేళ్ల నిషేధాన్ని విధించింది.

నాసిర్ జంషెడ్ భార్య సమారా అఫ్జల్ స్పాట్ ఫిక్సింగ్ వార్తలపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'జంషెడ్ చర్యల కారణంగా మా కుటుంబానికి ఘోర అవమానం జరిగింది. ఇతర క్రికెటర్లను అవినీతికి పాల్పడమని చెప్పడం సమంజసం కాదు. జంషెడ్ కష్టపడి ఉంటే అతనికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది. కానీ అతను షార్ట్ కట్ మార్గం ఎంచుకుని ప్రతిదీ కోల్పోయాడు. కెరీర్, హోదా, గౌరవం అన్ని నాశనం చేసుకున్నాడంటూ' ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు