పాక్ క్రికెటర్‌పై సెటైర్లు, కుళ్లు జోకులు

15 Jun, 2017 12:42 IST|Sakshi
పాక్ జట్టులో అతడికి చోటివ్వొద్దు!

కార్డిఫ్‌: సంచలనాలకు కేంద్ర బిందువైన పాకిస్తాన్‌ మళ్లీ అనూహ్య విజయాన్ని దక్కించుకుని చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా ఫైనల్ చేరుకుంది. పదునైన బౌలింగ్ అటాక్‌తో పాటు అజహర్‌ అలీ (100 బంతుల్లో 76; 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఫఖర్‌ జమాన్‌ (58 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలతో చెలరేగడంతో సెమీస్‌లో పాక్‌ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను కంగుతినిపించింది. అయితే పాక్ అభిమానులు మాత్రం బౌలర్ వహాబ్ రియాజ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. నువ్వు లేకపోవడం వల్లే విజయం సాధ్యమైందని.. పుణ్యం కట్టుకున్నావని కొందరు కామెంట్లు చేయగా, అసలు నువ్వు ఎప్పటికీ జట్టులోకి రాకుడదంటూ మరికొందరు ట్వీట్లతో రెచ్చిపోతున్నారు.

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వహాబ్ రియాజ్ పాక్ అభిమానులతో తీవ్రంగా నిరాశపడటంతో పాటు గాయాలపాలై తర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాక్ అభిమానులు వహాబ్ లేకపోవడమే జట్టుకు వరంలా మారిందని ఎద్దేవా చేస్తున్నారు. 'వహాబ్ జట్టులో లేకపోతే మా బౌలర్లు ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకే కట్టడి చేస్తున్నారని' ఉమర్ ఫరూఖ్ అనే యూజర్ కామెంట్ చేశాడు. 'వహాబ్ దూరం కాగానే పాక్ జట్టులో మునుపటి ఉత్సాహం వచ్చింది. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. పాక్ జట్టులోకి అతడిని ఎప్పటికీ తీసుకోవద్దని కోరుతూ' సోహైల్ ఛెమా అనే పాక్ అభిమాని ట్వీట్ చేశాడు.  హసన్‌ అలీ (3/35) తో రాణించగా, జునైద్‌ ఖాన్, రుమాన్‌ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు.

నేడు జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌లు తలపడనున్నాయి. నెగ్గిన జట్టు 18న జరిగే ఫైనల్లో పాక్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

మరిన్ని వార్తలు