ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధించిన పాక్‌

21 Mar, 2019 17:55 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2019 ప్రసారాలను పాకిస్తాన్‌లో నిషేధిస్తున్నామని ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్‌ అహ్మద్‌ చౌద్రీ తెలిపారు. ఈమేరకు.. ‘ రాజకీయాలను, క్రీడలను వేరుగా చూడాలని భావించాం.  కానీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) జరిగిన సమయంలో భారత ప్రభుత్వం, కంపెనీలు పాక్‌ క్రికెట్‌ పట్ల ప్రవర్తించిన తీరు మాకు గుర్తుంది. కాబట్టి ఐపీఎల్‌ ప్రసారాలు పాకిస్తాన్‌లో ప్రదర్శించబడటాన్ని మేము సహించలేం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’  అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఫిబ్రవరి 14న కశ్మీన్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు పీఎస్‌ఎల్‌ నాలుగవ సీజన్‌ ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ భారత్‌ను ఇబ్బందుల పాలు చేస్తున్న కారణంగా.. భారత్‌లో పీఎస్‌ఎల్‌ ప్రసారాల్ని నిలిపివేస్తూ డీస్పోర్ట్‌ చానల్‌ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ వెనువెంటనే పీఎస్ఎల్ కు అఫీషియల్ ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్ తో ఏ మాత్రం భాగస్వామ్యాన్ని కొనసాగించబోమని స్పష్టం చేసింది. ఇక పాక్‌ ప్రధాని, ఆ దేశ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోలను క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తొలగించిన సంగతి తెలిసిందే. అంతేకాదు రానున్న ప్రపంచకప్‌లో పాక్‌తో ఆడకూడదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పీసీబీ.. బీసీసీఐ, భారత ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేయాలని చూసింది. పుల్వామా ఘటనకు సంతాప సూచకంగా మిలిటరీ క్యా పులు ధరించినందుకు టీమిండియా ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది కూడా.(టీమిండియాపై చర్యలు తీసుకోవాల్సిందే : పీసీబీ)

కాగా మరో రెండు రోజుల్లో ఇండియన్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ 2019 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగా ఈ నెల 23న జరిగే తొలి మ్యాచ్‌లో కోహ్లి మిస్టర్‌ కూల్‌ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్టు... టీమిండియా కెప్టెన్‌ కోహ్లి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుతో తలపడనుంది. ఇద్దరు దిగ్గజాల జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గత సీజన్‌ విన్నర్‌గా నిలిచిన సీఎస్‌కే హాట్‌ ఫేవరెట్‌గా బరిలో దిగుతుండగా... అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్‌ టైటిల్‌ గెలవాలని ఆర్సీబీ ఉవ్విళ్లూరుతోంది.

మరిన్ని వార్తలు