కష్టపడి ఆడటం రాదు; దేవుడిపైనే భారమా..?

4 Jul, 2019 14:39 IST|Sakshi

జట్టు పేలవ ప్రదర్శనపై పాక్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరింది. 27 ఏళ్ల అనంతరం ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ సెమీస్‌ చేరడం విశేషం. ఇక ఈ ఫలితంతో పాకిస్తాన్‌ సెమీస్‌ చేరడం కష్టసాధ్యమైన పని. ఒకవేళ నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌గనుక ఓడిపోయుంటే... 9 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న పాకిస్తాన్‌ శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్లేది. 10 పాయింట్లతో ఇంగ్లండ్‌ ఐదో స్థానానికి పరిమితమయ్యేది. 

అందుకనే బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోవాలని యావత్‌ పాకిస్తాన్‌ కోరుకుంది. అయితే, అద్భుత ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ అటు బ్యాట్‌తోనూ.. ఇటు బంతితోనూ రాణించి ఘన విజయం సాధించింది. తాజా సమీకరణం ప్రకారం బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో పాక్‌ 316 పరుగుల భారీ తేడాతో విజయం సాధించాలి. కానీ, వన్డే చరిత్రలో ఇప్పటివరకు ఇంత భారీ తేడాతో ఏ జట్టూ గెలిచిన దాఖలాలు లేవు. ఒకవేళ బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తే మాత్రం ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా పాకిస్తాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. 

ఇక జట్టు పేలవ ప్రదర్శనపై సగటు పాక్‌ క్రికెట్‌ అభిమాని దుమ్మెత్తి పోస్తున్నాడు. ముందునుంచీ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడకుండా.. ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పాక్‌ మాజీ ఆటగాళ్లు ‘అల్లాకి దువా’ చేస్తున్న ఫొటో షేర్‌ చేసి.. మా ఆటగాళ్లు దేవునిదే భారం అనే ధోరణిలో ఉన్నారని.. కష్టపడి ఆడడం రాదని చురకలంటిస్తున్నారు. ఇక 1992 ప్రపంచకప్‌ ఫలితాన్ని పాక్‌ రిపీట్‌ చేస్తుందని.. ట్రోఫీని ఎగరేసుకుపోతుందని ఎన్నో అంచనాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు