పాకిస్తాన్‌ జట్టుకు ఝలక్‌

13 Jun, 2017 12:10 IST|Sakshi
పాకిస్తాన్‌ జట్టుకు ఝలక్‌

కార్డిఫ్‌: చాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌ చేరుకున్న ఆనందంలో ఉన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు షాక్‌ తగిలింది. పాక్‌ టీమ్‌కు మ్యాచ్‌ రిఫరీల ప్యానల్‌ ఝలక్‌ ఇచ్చింది. నిర్ణీత సమయం కంటే తక్కువ ఓవర్లు వేసినందుకు జరిమానా విధించింది. పాక్‌ క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం చొప్పున కోత విధించింది. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు 20 శాతం జరిమానా వేసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని 2.5.1 నిబంధన కింద ఈ చర్య తీసుకుంది. తప్పును ఒప్పుకోవడంతో పాటు జరిమానా చెల్లించేందుకు పాకిస్తాన్‌ టీమ్‌ అంగీకరించడంతో దీనిపై ఇక ఎటువంటి విచారణ జరపాల్సిన అవరసరముండదు. రెండోసారి కూడా పాక్‌ జట్టు ఇదే తప్పు చేస్తే కెప్టెన్‌ సర్ఫరాజ్‌ను ఒక మ్యాచ్‌ ఆడకుండా నిషేధం ఎదుర్కొవాల్సివుంటుంది.

చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన శ్రీలంకతో జరిగిన గ్రూప్‌‘బీ’  మ్యాచ్‌లో పాక్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ జట్టుతో పాకిస్తాన్‌ తలపడనుంది. సర్ఫరాజ్‌ (79 బంతుల్లో 61 నాటౌట్‌; 5 ఫోర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయపథంలో నడిపించాడు.
 

మరిన్ని వార్తలు