అయ్యో పాకిస్తాన్‌...

5 Jul, 2019 19:08 IST|Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తలపడుతున్న పాకిస్తాన్‌ సెమీస్‌కు చేరాలంటే 316 పరుగుల భారీ తేడాతో గెలవాలి. మరి టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. దాంతో పాకిస్తాన్‌ కథ లీగ్‌ దశలోనే ముగిసింది. సెమీస్‌కు చేరడానికి ఎన్ని పరుగులు వ్యత్యాసం కావాలో అంతే లక్ష్యాన్ని పాక్‌ నిర్దేశించడం ఇక్కడ గమనార్హం. పాక్‌ ఆటగాళ్లలో ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌(100; 100 బంతుల్లో 7 ఫోర్లు) శతకంతో మెరిశాడు. ఇది ఇమాముక్‌కు తొలి వరల్డ్‌కప్‌ సెంచరీ.

ఆ తర్వాత బాబర్‌ అజామ్‌(96; 98 బంతుల్లో 11 ఫోర్లు) తృటిలో సెంచరీ కోల్పోయాడు. ఆపై ఇమాద్‌ వసీం(43), మహ్మద్‌ హఫీజ్‌(27)లు ఫర్వాలేదనిపించారు. హరీస్‌ సొహైల్‌(6) నిరాశపరచగా, సర్ఫరాజ్‌ అహ్మద్‌(3 నాటౌట్‌) మ్యాచ్‌ మధ్యలో రిటైర్డ్‌హర్ట్‌గా పెవిలియన్‌కు చేరి, ఆఖరి బంతికి క్రీజ్‌లోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాకిస్తాన్‌ పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ చెలరేగి బౌలింగ్‌ చేశాడు. ఐదు వికెట్లు సాధించి మరోసారి సత్తాచాటాడు. అతనిక జతగా సైఫుద్దీన్‌ మూడు వికెట్లు సాధించగా, మెహిదీ హసన్‌ వికెట్‌ తీశాడు.

ఈ వరల్డ్‌క్‌పలో పడుతూలేస్తూ సాగిన పాకిస్తాన్‌ పయనం.. ఏడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలుపొందడంతో గాడిన పడింది. ఆ మ్యాచ్‌ నాటికి అచ్చం..1992 ప్రపంచక్‌పలో మాదిరి పరిస్థితులు ఏర్పడడంతో అప్పటి లాగానే తాము ట్రోఫీ సాధించగలమని అటు పాకిస్తాన్‌ జట్టుతో పాటు ఆ దేశ అభిమానులు ఆశల పల్లకిలో ఊరేగారు.  కానీ ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌ ఓడడంతో పాక్‌ సెమీస్‌ ఆశలు సన్నగిల్లాయి. ఇక బుధవారంనాటి పోరులో ఆతిథ్య జట్టు చేతిలో న్యూజిలాండ్‌ పరాజయం చవిచూడడంతో సర్ఫ్‌రాజ్‌ సేన నాకౌట్‌ ఆశలు దాదాపు అడుగంటాయి. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో సైతం పాకిస్తాన్‌ 315 పరుగులకే పరిమితం కావడంతో ఆ జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది.


 

మరిన్ని వార్తలు