‘ఆ సత్తా పాకిస్తాన్‌కు ఉంది’

3 Jun, 2019 14:26 IST|Sakshi

నాటింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టును ఓడించే సత్తా తమ క్రికెట్‌ జట్టుకు ఉందని పాకిస్తాన్‌ బౌలింగ్‌ కోచ్‌ అజహర్‌ మహ్మద్‌ ధీమా వ్యక్తం చేశాడు. సోమవారం ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాకిస్తాన్‌ తలపడుతున్న తరుణంలో అజహర్‌ మహ్మద్‌ స్పందించాడు. ఇంగ్లండ్‌ను ఓడించే అన్ని వనరులు తమ జట్టులో ఉన్నాయన్నాడు. ‘ ఇంగ్లండ్‌పై మాదే పైచేయి అవుతుందని ఆశిస్తున్నా. కచ్చితంగా ఇంగ్లండ్‌ను కొట్టగలం. ఆ సత్తా మా క్రికెటర్లలో ఉంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఒక్కసారి చూడండి.

మేము ఆ జట్టుతో పోటీపడి పరుగులు సాధించాం. ఓవరాల్‌గా సిరీస్‌ను కోల్పోయినా ఆ జట్టుకు మా జట్టుకు ఉన్న పరుగుల వ్యత్యాసం పెద్ద ఎక్కువేమీ కాదు. కేవలం మా ఫీల్డింగ్‌ పేలవంగా ఉండటంతో పాటు బౌలింగ్‌లో అదనపు బౌన్స్‌ రాకపోవడం వల్లే సిరీస్‌ కోల్పోయాం. మా బౌలింగ్‌ విఫలం కావడానికి అనుభవం లేని ఆటగాళ్లు జట్టులో ఉండటమే కారణం. ఈసారి మా బౌలింగ్‌ విభాగంలోకి సీనియర్‌ ఆటగాళ్లు వచ్చారు. పది వికెట్లు తీయడానికి పది మంచి బంతులు పడితే సరిపోతుంది’ అని అజహర్‌ మహ్మద్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు