ఎవర్నీ తిట్టాల్సిన అవసరం లేదు: అక్తర్‌

4 Jul, 2019 17:26 IST|Sakshi

లీడ్స్‌: ప్రస్తుత వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ జట్టు సెమీస్‌కు చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయిన తరుణంలో ఆ దేశ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ స్పందించాడు. తమ జట్టు సెమీస్‌ అవకాశాలు ఇక లేనట్లేనని, ఇక్కడ ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదని అకర్త్‌ పేర్కొన్నాడు. ‘పాకిస్తాన్ తనంత తానుగా సెమీస్‌ అవకాశాలను క్లిష్టతరం చేసుకుందని అక్తర్ పేర్కొన్నాడు. ‘వెస్టిండీస్‌పై జరిగిన మ్యాచ్‌తో మాకు తీవ్ర నష్టం జరిగింది. తర్వాత శ్రీలంకపై జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మావాళ్లు ఆస్ట్రేలియాపై ఓడిపోయారు. ఈ మూడు మ్యాచ్‌లు పాకిస్తాన్‌ కష్టాలకు కారణమయ్యాయి. దీంతో తనంత తానే పాకిస్తాన్ ఈ టోర్నమెంటు నుంచి వైదొలగాల్సి వస్తోంది. దీనికి ఎవర్నీ బాధ్యుల్ని చేయలేం. ఎవర్నీ తిట్టాల్సిన అవసరం కూడా లేదు’ అని పేర్కొన్నాడు. ఇప్పటికైనా పాకిస్తాన్‌కు పోయిందేమీ లేదనీ.. బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించి సత్తా చాటుకోవాలని సూచించాడు.

కాగా న్యూజిలాండ్ జట్టుపై ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో విజయం సాధించడంపైనా అక్తర్ స్పందించాడు. న్యూజిలాండ్ జట్టు ఏమాత్రం నాణ్యత లేకుండా ‘చెత్తగా’ ఆడడం వల్లే ఓడిపోయిందన్నాడు.  మరొకవైపు క్రికెట్‌లో నాణ్యతపై అక్తర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు పరుగులు స్కోర్ చేయడం మంచినీళ్లు తాగినంత సులభంగా మారిపోయిందని, బౌలర్లకు ఏమాత్రం నాణ్యత లేదన్నాడు. దీనికి తోడు మూడు పవర్‌ప్లేలు, రెండు కొత్త బంతులతో పరుగులు చేయడం మరింత సులభంగా మారిందని అక్తర్‌ స్పష్టం చేశాడు.


 

మరిన్ని వార్తలు