భారత్‌ సంగతి మీకెందుకు!

24 Dec, 2019 13:22 IST|Sakshi

పీసీబీకి బీసీసీఐ స్ట్రాంగ్‌ కౌంటర్‌

న్యూఢిల్లీ:  భారత్‌లో కంటే తమ దేశంలో సెక్యూరిటీ బాగుందంటూ అక్కసును ప్రదర్శించిన పాకిస్తాన్‌  క్రికెట్‌  బోర్డు చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణికి బీసీసీఐ స్ట్రాంగ్‌  కౌంటర్‌ ఇచ్చింది. తమ దేశంలో సంగతి తాము చూసుకుంటామని, మీ దేశంలో సెక్యూరిటీపై దృష్టి పెడితే సమంజసంగా ఉంటుందంటూ బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ మహీమ్‌ వర్మ  స్పష్టం చేశారు. అసలు భారత్‌లో సంగతి పీసీబీకి ఎందుకంటూ మండిపడ్డారు. ‘ ముందు మీరు చేయాల్సింది.. మీ దేశంలో రక్షణ గురించి. తొలుత దానిపై ఫోకస్‌ చేయండి. అంతేకానీ భారత్‌లో సెక్యూరిటీని ఉదహరిస్తూ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. మా సెక్యూరిటీ గురించి మేము చూసుకుంటాం. మా దేశంలో పటిష్టమైన సెక్యూరిటీతో మ్యాచ్‌లు నిర్వహించుకునే సత్తా మాకు ఉంది. అందుకు తగినంత బలం మాకు  ఉంది. మాపై వ్యాఖ్యలు ఆపి మీ పని మీరు చూసుకుంటే మంచిది’ అని మహీమ్‌ వర్మ స్పష్టం చేశారు.

స్వదేశంలో దశాబ్దం తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు సిరీస్‌ విజయవంతం కావడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అమితానందంగా ఉంది. ఈ సందర్భంగా పీసీబీ చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు భారత్‌పై అక్కసు వెల్లగక్కాడు. భద్రతా పరంగా భారత్‌ కంటే పాకిస్తాన్‌ ఎంతో సురక్షితమని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌తో పాకిస్తాన్‌ సురక్షిత దేశమని నిరూపించాం. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే ఇక్కడికి(పాక్‌) రండి మా భద్రతా ఎలా ఉందో చూపిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో మా పొరుగు దేశమైన భారత్‌ కంటే పాక్‌ ఎంతో సురక్షితమైన దేశం. మరి భారత్‌కు వెళ్లి క్రికెట్‌ ఆడటానికి లేని భయం పాక్‌ రావడానికి ఎందుకు?’ అని వ్యాఖ్యానించాడు. (ఇక్కడ చదవండి: ‘భారత్‌ కంటే పాకిస్తాన్‌ ఎంతో సురక్షితం’)

మరిన్ని వార్తలు